విజయసాయికి మళ్లీ సీఐడీ నోటీసులు

రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డికి సీఐడీ తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొంది. ఈ నెల 12న విజయసాయి రెడ్డి విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయిపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించే  సీఐడీ ఈ నెల 10న విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చి 12న విచారణకు రావాల్సిందిగా పేర్కొంది.

ఆ మేరకు విజయసాయిరెడ్డి మార్చి 12న సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఆ విచారణ తరువాత విజయసాయి మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా కాకినాడ పోర్టు వ్యవహారంలో తనకు ఏమీ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కేవీరెడ్డితో తానెప్పుడూ భేటీ కాలేదనీ చెప్పుకొచ్చారు. ఆయనతో ఎలాంటి వ్యాపార లావాదేవీలూ లేవని కూడా చెప్పారు. అక్కడితో ఆగకుండా కాకినాడ పోర్టు వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా జగన్ బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే అని వెల్లడించారు. తనకు ఉన్న సమాచారం మేరకు కేవీరావు ఈ కేసులో తన పేరును ఒక అధికారి ఒత్తిడి వల్లే చేర్చారని చెప్పుకొచ్చారు.  ఈ విషయంలో సీఐడీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని వారన్నారని వివరించారు.

ఇది జరిగి వారం రోజులు కాకముందే సీఐడీ నుంచి విజయసాయికి మరో సారి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాకుండా కేవలం రెండు మూడు రోజుల కిందటే విశాఖ భీమిలీ బీజ్ లో విజయసాయి కుమార్తెకు చెందిన అక్రమ కట్టడాలను కోర్టు ఆదేశాల మేరకు అధికారులు కూల్చి వేశారు. ఇలా విజయసాయికి రాజకీయ విరామం ప్రకటించిన తరువాత కూడా వరుసబెట్టి షాకులు తగులుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సారి సీఐడీ విచారణకు హాజరైన తరువాత విజయసాయి మరిన్ని సంచలన విషయాలు వెల్లడించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా గత విచారణ అనంతరం మీడియాతో  ఏపీ మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజ్ అని చెప్పిన విజయసాయి, ఆ వివరాలను తరువాత చెబుతానని చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.