తమ్మినేని డిగ్రీ చదువుకున్నారా? కొన్నారా? తేల్చనున్న ప్రభుత్వ విచారణ
posted on Mar 24, 2025 2:22PM
.webp)
రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. రాజకీయ ప్రవేశానికి కానీ, పదవులకు కానీ చదువు అనేది ఒక అర్హత కానే కాదు. పంచాయతీ బోర్డు సభ్యడి నుంచి ప్రధాని పదవి వరకూ దేనికీ ఎటువంటి విద్యార్హతా అక్కర్లేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు ఆదరించి గెలిపిస్తే ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి ఇలా ఏదైనా కావచ్చు. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు. డిగ్రీలు అక్కరలేదు.
అయినా రాజకీయ నాయకుల విద్యార్హతలు, డిగ్రీలు తరచూ వివాదం అవుతూనే ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీలపై వివాదం నడిచిన సంగతి తెలిసిందే. మోదీ విద్యార్హతలు, డిగ్రీలకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునేందుకు అప్పట్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రివాల్ చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ ..ఇంకా కొందరు ముఖ్య నేతలకు సంబందించిన విద్యార్హతల విషయంలోనూ విషయంలోనూ వివాదాలు చెలరేగాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం పేరు ఈ జాబితాలో ఉంది. ఆయన డిగ్రీ చదువు కోలేదనీ, చదువు కొన్నారనీ తెలుగుదేశం గతంలో ఆరోపించింది. సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ కూడా చేసింది. అదలా ఉంచితే స్వయంగా తమ్మినేని సీతారాం తాను డిగ్రీ చదువు కోలేదని అప్పట్లోనే అంగీకరించేశారు.
అంగీకరించడమంటే నేను డిగ్రీ చదువుకోలేదు.. డిగ్రీ కొనుక్కున్నాను స్వయంగా తనంతట తాను చెప్పడం కాదు. ఆముదాలవలస వైసీపీ అభ్యర్థిగా పోటీకి ఆయన దాఖలు చేసిన నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో ఆయన విద్యార్హతకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ డిస్ కంటిన్యూ అని ఉంది. మరి డిగ్రీ పూర్తి కాకుండా తమ్మినేని లా ఎలా చేశారు? అన్న చర్చ అప్పట్లో గట్టిగా జరిగింది. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో దీనిని పట్టించుకోలేదు.
ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తమ్మినేని విద్యార్హతలపై ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ విషయంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో తమ్మినేని డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదా? కాదా అన్నది ఈ విచారణ తేల్చనున్నది. తమ్మినేని స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్న నేపథ్యంలో ఆయన డిగ్రీ సర్టిఫికెట్ ఎక్కడిది? ఎలా వచ్చింది? డిగ్రీ చేయకుండా లా ఎలా చదివారు ఇత్యాది విషయాలన్నీ దర్యాప్తులో తేలనున్నాయి.