సెలబ్రిటీలు అంటే ఎవరు?
posted on Mar 21, 2025 5:31PM

వెండి తెర పైనో, బుల్లి తెర పైనో, కనిపించిన ప్రతి ఒక్కరూ సెలబ్రిటీనేనా? ఇంకేమైనా అర్హతలు, యోగ్యతలు అవసరం అవుతాయా? అంటే సమాధానం చెప్పడం కష్టం కాదు గానీ, ఇబ్బందికరంగా ఉంటుంది. వెండి తెరను, బుల్లి తెరను మలినం చేసిన, చేస్తున్న పెద్ద మనుషులు.. ఆ పెద్ద మనుషుల అడుగు జాడల్లో నడుస్తున్న కుక్కమూతి పిందిలే ఈ రోజు సమాజంలో సెలబ్రిటీలుగా చెలామణి అవుతున్నారు. అలాంటి సెలబ్రిటీలే కాసులకు కక్కుర్తి పడుతున్నారు. డ్రగ్ ఫెడ్డ్లింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, ఇంకా నీచమైన పనులకు సెలబ్రిటీ స్టేటస్ ను ఉపయోగించు కుంటున్నారు. ఒక విధంగా చూస్తే.. సమాజానికి పట్టిన చీడ పురుగుల్లా తయారయ్యారు. అయితే అందరూ అంతేనా అంటే కాదు. అందరూ కాకా పోవచ్చును కానీ.. పెద్ద హీరోలు సహా మిగిలిన సోకాల్డ్ పెద్దలు అందరూ అదే కోవకు చెందిన పెద్ద మనుషులు కావడమే విషాదం.
అవును, ఇక్కడ పెద్ద మనుషులు అంటే సంజహితాన్ని కోరుకునే వారో, సమాజంలో మంచి పెంచే వారు కాదు. పరమానందయ్య శిష్యుల కథలో (‘‘పరమగురుడు చెప్పిన వాడు.. పెద్దమనిషి కాదురా..పెద్దమనిషి అంటేనే బుద్ధులన్ని వేరురా..``) చెప్పినట్లు బుద్దులు వేరైన వారే ఈ రోజు సమాజంలో సెలబ్రిటీలుగా చెలామణి అవుతున్నారు.
అయితే ఒక్క సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళేనా, సమాజంలోని ఇతర పెద్దలంతా ఉత్తమ పురుషులేనా? శ్రీరామ చంద్రుడు, సీతమ్మ తల్లి అంత పవిత్రులు, పునీతులేనా? అంటే కాదు. కానీ అలాంటి వారి దుష్ప్రభావం సమాజం పై ఇంత విస్తృతంగా ఉండదు. ఎటొచ్చి, సమాజాన్ని ముఖ్యంగా టీనేజ్ యువతపై చెడు ప్రభావం చూపుతున్నది, సినిమా,టీవీ, సోషల్ మీడియా.
ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే ఇప్పడు మనం ఏ న్యూస్ చానల్ చూసినా, బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్’ కేసులకు సంబంధించిన సంచలన వార్తలే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఈ కేసుల్లో వినిపిస్తున్న పెద్ద మనుషులంతా సినిమా, టీవీ రంగాలకు చెందిన సెలబ్రిటీలే. అందులో దగ్గుబాటి వారబ్బాయి ఉన్నారు సంచలన హీరో విజయ దేవర కొండ ఉన్నారు. మంచు వారమ్మాయి ఉన్నారు. ప్రధాని మోదీకి నీతి పాఠాలు చెప్పే, పే..ద్ద మనిషి ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఈ పెద్ద మనుషులతో పాటుగా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ‘నీతి’ బాటలో నడిచే యాంకరమ్మ శ్యామల ఉన్నారు. ఇంకా ఇలాంటి, సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. హైదరాబాద్ పోలీసులు ఈ జాబితాలో ఉన్న పెద్ద మనుషులు అందిరికో లేదా సెలెక్టివ్ గాకొందరికో నోటీసులు ఇచ్చి, విచారణ చేస్తున్నారు. సరే ఆ సంచలనం, ఇంకొంత కాలం అలా సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత.. కథ కంచికి చేరుతుంది. గతంలో ఇంతకంటే గొప్ప సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు చివరుకు చడీచప్పడు లేకుండా పోయింది. నిజానికి బెట్టింగ్, డ్రగ్స్ కేసులే కాదు, భూ కబ్జాలు మొదలు సినిమా సెలబ్రిటీలతో ముడిపడిన కేసులు చాలా వరకు... ముగింపు లేకుండానే ముగిసి పోతుంటాయి. కాబట్టి ఈకే సు ఏమి అవుతుంది అన్న ప్రశ్న అవసరం లేదు. సమా జంలో సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న సినిమా పెద్దలు, సోకాల్డ్ సెలబ్రిటీలు ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. సెలబ్రిటీ స్టేటస్ తో పాటుగా, సామాజిక బాధ్యతను స్వీకరించినప్పుడే స్టేటస్ కు ఒక విలువ ఉంటుంది.వ్యక్తిగత జీవితంలోనే కాదు.. సినిమా నిర్మాణంలోనూ ఇది అవసరమే.