అవనిగడ్డ లో  నిషేధిత ఐసిస్ డ్రగ్ కలకలం...దాడుల్లో విస్తుకోల్పేయే నిజాలు

ఆంధ్ర ప్రదేశ్  అవనిగడ్డలో  ఐసిస్ డ్రగ్ కలకలం రేపింది.  తాజాగా ఈగల్ టీం దాడుల్లో విస్తుకోల్పోయే నిజాలు వెల్లడయ్యాయి. ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు వినియోగించే డ్రగ్స్  కృష్ణా జిల్లా అవనిగడ్డ వీధుల్లో లభ్యం కావడంతో అధికారుల  ఫీజులు ఎగిరిపోయాయి. ఐసిస్  ఉగ్రవాద సంస్థ వినియోగించే  ట్రెమడాల్ అనే సైకో ట్రోపిక్ సబ్ స్టెన్స్( మాదక ద్రవ్యం) ఎలాంటి అనుమతులు లేకుండా  విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు.  గత రెండేళ్ల కాలంలో  55,961 ట్రెమడాల్  ట్యాబ్లెట్లు, 2, 794 ఇంజక్షన్లు అనుమతి లేకుండానే విక్రయాలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అవనిగడ్డలోని భార్గవ్ మెడికల్ హాల్ ఈ చీకటి వ్యాపారాన్ని ప్రారంభించింది నిన్న మొన్న కాదు.2022 నుంచి  అమ్మకాలుచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఈ అమ్మకాలను కట్టడి చేయలేకపోయింది. ఐసిస్ డ్రగ్ దందాను నడుపుతున్న భార్గవ్ మెడికల్ షాపుపై కేసు నమోదైంది.  మెడికల్ షాప్ యాజమాని కొనకళ్ల రామ్మోహన్  తాను చేసిన నేరాన్ని  అంగీకరించారు. చాలాకాలం నుంచి నిషేధిత డ్రగ్స్ అమ్ముతున్నట్లు చెప్పారు. ఈగల్ టీం అధికారులు దాడులు జరపడం ఇదే మొదటి సారి అని రామ్మోహన్ పేర్కొన్నారు. 

ఫైటర్ డ్రగ్ గా పిలిచే ఐసిసి డ్రగ్ ను మిలిటెంట్లు శిక్షణ కాలం నుంచే వాడతారు. కొత్తగా రిక్రూట్ అయిన మిలిటెంట్ల కు శిక్షణ ఇచ్చే కాలంలో ఐసిస్ డ్రగ్ వినియోగిస్తే అలసట, నిద్ర రాకుండా ఉంటుందని అధికారులు తెలిపారు, ఎక్కువ సేపు  ఉత్తేజంగా పనిచేయటానికి ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులకు ఈ ట్రెమడాల్‌ మాత్రలను అందిస్తుంటాయి. అందుకే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ''ఐసిస్‌ డ్రగ్‌''గా పిలుస్తారు.  ఎన్ ఫోర్స్ మెంట్   డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు  దాడులుచేసి నిషేధిత డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్  ఈగల్ ఐజి రవికృష్ణ తెలిపారు.  ట్రెమడాల్ డ్రగ్ ను  2018లో  కేంద్ర ప్రభుత్వం నిషేధిత డ్రగ్ జాబితాలో చేర్చింది. అంతే కాదు ఎన్ డిపిఎస్ చట్టం పరిధిలో చేర్చింది. ట్రెమడాల్ ను మాదక ద్రవ్యంగా గుర్తించి కాంబినేషన్,  అనుమతించిన పరిమాణంలోనే వైద్యుల సలహా మేరకు వినియోగించాలన్న నిబంధన పెట్టింది. 

అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో  యువత  ఎక్కువగా ఈ నిషేధిత డ్రగ్ వినియోగిస్తున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. వందలాది మంది యువకులు  ఈ మత్తుకు బానిసలయ్యారు.ఎన్ డిపిఎస్ చట్టంలోని సెక్షన్ల క్రింద అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
 కాగా విశాఖ పట్నంలో కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న ఐదు మెడికల్ షాపులను అధికారులు సీజ్ చేశారు.