తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ
posted on Mar 21, 2025 6:50PM

తెలంగాణ రాజకీయాలలో అనూహ్య సంఘటన జరిగింది. ఉప్పూ నిప్పులా ఉండే రేవంత్ రెడ్డి, హరీష్ రావులు శుక్రవారం భేటీ అయ్యారు. మాజీ మంత్రి పద్మారావుగౌడ్ తో కలిసి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ కు వెళ్లిన హరీష్ రావు ఆయనతో దాదాపు పావుగంట సేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు నియోజకవర్గాలలో ప్రొటో కాల్ పాటించడం లేదని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ భేటీకి ముందు అసెంబ్లీలో హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఆ సందరభంగా ఇరువురూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై హరీష్ రావు విమర్శలు చేస్తే.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఇది జరిగిన గంట వ్యవధిలోనే హరీష్ రావు సీఎం చాంబర్ కు వెళ్లి మరీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.