అమరావతిపై శ్వేతపత్రం..ఐదేళ్ల విధ్వంసాన్ని ప్రజలకు వివరించనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో వేగం పెంచారు. జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల కళ్లకు కట్టడం తో పాటు.. రాష్ట్రాన్ని పురొగమన బాట పట్టించడంపై దృష్టి సారించారు. ముందుగా చెప్పినట్లుగానే జులై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా కింద పెంచిన పెన్షన్లను ఎరియర్స్ తో సహా పంపిణీ చేశారు.  

ఇప్పటికే పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేసిన చంద్రబాబు..ఇహక ఇప్పుడు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. గత ఐదేళ్లలో అమరావతిలో జరిగిన విధ్వంసం, ప్రస్తుత పరిస్థితిపై బుధవారం (జులై 3) శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అదే సమయంలో అమరావతిపై తమ ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను కూడా వెల్లడించనున్నారు. 

ఇలా ఉండగా రహదారులు, భవనాల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం (జులై2) అధికారులతో సమీక్షించనున్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులు, మరమ్మతులు తదితర అంశాలపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. వర్షాకాలం దృష్ట్యా ముందు గుంతలు పూడ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రహదారి మౌలిక వసతుల నిధితో రాష్ట్రంలో విస్తరించాల్సిన రోడ్లపై కూడా చంద్రబాబు అధికారులతో సమీక్షించనున్నారు.