జగన్ నిర్వాకం ఏపీకి శాపం.. బాబు విజనే ఇప్పుడు ఆశాదీపం!

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ఎంత దెబ్బతిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తెలిసిన దాని కంటే  చాలా చాలా ఎక్కువ నష్టం జరిగిందన్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం (జులై 3) అమరావతిపై విడుదల చేసిన శ్వేతపత్రం తేటతెల్ల చేసింది.  జగన్ తన హయాంలో పనిగట్టుకుని మరీ రాష్ట్రం పరువును గంగలో కలిపేయడానికి కంకణం కట్టుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరించిన తీరు ఉంది.  రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పుల కుప్పలా మార్చేసింది.

ఆ విషయం ఆయన అధికారంలో ఉన్న సమయంలోనే ఎన్నో నివేదికలు బట్టబయలు చేశాయి.  అయితే జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకంపై ఆర్థిక నిపుణులు ఎంత ఆందోళన వ్యక్తం చేసినా, రాష్ట్రం దివాళా అంచుకు చేరుకుందని నవేదికలు స్పష్టం చేసినా, చివరాఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినా, జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినంత నెప్పి కూడా కలగలేదు. జగన్ రెడ్డి నిర్వాకం వల్ల ఏపీ పరువు గంగలో కలిసిపోతోందని అప్పట్లో తెలుగువన్ కూడా   హెచ్చరించింది.   అప్పుల మీద అప్పులు.. అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్త అప్పులు చేసుకుంటూ, బాండ్ల నుండి ప్రభుత్వ ఆస్తుల వరకూ అన్నిటినీ తనఖా పెట్టేసి అప్పులు చేసేస్తోందని గణాంకాలతో సహా వివరించింది.  ఒక రాష్ట్రం చేయాల్సిన అప్పుల పరిధికి మించి జగన్ సర్కార్ అప్పులు చేసేసింది. అలా అప్పు చేసి తెచ్చిన సొమ్ములతో   అభివృద్ధి, ఉపాధి రంగంలో పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని పెంచుకునే చర్యలు చేపట్టిందా అంటే అదీ లేదు. కేవలం బటన్ నొక్కి  పప్పు బెల్లాల మాదిరి సొమ్ములు పంచుకుంటూ వెళ్లింది.  దీంతో జగన్ హయాంలో ఆయన ప్రభుత్వం  ప్పుల మీదనే  నడిచింది.

దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల విషయంలో రాష్ట్రం డేంజర్ లిస్టులోకి వెళ్ళింది. ఏపీకి కొత్తగా అప్పులు ఇస్తే రిస్క్ అంటూ ఫైనాన్స్ ఏజెన్సీలు రేటింగ్ ఇచ్చేశాయి. ఏపీ ప్రభుత్వం గతంలో జారీ చేసిన సీఆర్డీఏ బాండ్స్ రిస్క్ అంటూ క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేసింది. ఈ విషయాన్ని గతంలోనే తెలుగువన్ విస్పష్టంగా పేర్కొంది. అదే విషయాన్ని చంద్రబాబు అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చెప్పారు.    రేటింగ్ నెగెటివ్ వాచ్ లిస్ట్ లో పెట్టింది.   ఏపీ క్యాపిటల్ బాండ్స్‌కు స్టాక్ ఎక్సేంజ్‌  కూడా షాక్ ఇచ్చింది. ఏకంగా ఏపీ బాండ్లకు సీ గ్రేడ్ కేటాయించింది. ఈ మేరకు స్టాక్ ఎక్సేంజ్‌లకు రేటింగ్ సంస్థలు నోట్ పంపాయి. హై రిస్క్‌తో కూడిన బాండ్స్‌గా అక్యూట్ రేటింగ్ సంస్థ పేర్కొంది. దీనికి కారణం జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వమేనని అక్యూట్  సంస్థ గతంలోనే పేర్కొంది. ఈ బాండ్స్‌కు చెల్లించాల్సిన రూ.14 కోట్లు వడ్డీ కూడా నెల రోజులు ఆలస్యంగా చెల్లించారని రేటింగ్ సంస్థ వెల్లడించింది.  రాష్ట్రానికి సంబంధించి బీఎస్ఏ, డీఎస్ఆర్ఏ అకౌంట్స్‌లో ఉండాల్సిన రూ.525 కోట్లు మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేకుండా వాడేసుకోవడంతో క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేసింది. ఆ తరువాత రూ.14 కోట్లు వడ్డీ కూడా సమయానికి కట్టలేదని స్టాక్ ఎక్సేంజ్‌ సీ గ్రేడ్ కేటాయించింది.  

అంతకు ముందు అంటే 2014-2019 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఆర్డీఏ బాండ్లు రూ.1300 కోట్లకి రిలీజ్ చేస్తే.. కేవలం గంటలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్  అయ్యాయి. ఆ వెంటనే రూ.2000 కోట్లకి బాండ్స్ రిలీజ్  చేస్తే హాట్ కేకుల్లా సబ్‌స్క్రైబ్ అయిపోయాయి. చంద్రబాబు హయంలో బాండ్లు రిలీజ్ చేసే సమయానికి దేశవ్యాప్తంగా ఉన్న మునిసిపల్ కార్పొరేషన్స్ అన్నీ కలిపి రూ.1800 కోట్లకు బాండ్స్ జారీచేస్తే, చంద్రబాబు సర్కార్ కేవలం గంటలో రూ.2000 కోట్లు బాండ్స్ జారీ చేసింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి, పురోగతి, ఆర్థిక క్రమశిక్షణ విసయంలో ఉన్న విశ్వసనీయత అటువంటిది. అలాంటిది జగన్ సర్కార్ ఆ బ్రాండ్ ను, ఆ విశ్వసనీయతను కాలరాసేసింది.  ఏపీ అంటే అప్పుల మయం, దివాళా తీసిన రాష్ట్రం అంటూ బోర్డు కట్టేసే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ కాదు అప్పులప్రదేశ్‌ అంటూ జాతీయ స్థాయిలో ముద్ర పడిపోయిన పరిస్థితికి రాష్ట్రం చేరుకుంది.  ఇదే విషయాన్ని చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పుడు మళ్లీ జీరో నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం జరగాల్సి ఉంది. చంద్రబాబు దార్శనికత, ఆర్థిక క్రమశిక్షణ, విశ్వసనీయతే ఆంధ్రప్రదేశ్ ను ఒడ్డెక్కించగలవని జనం నమ్ముతున్నారు.