ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్‌ భేటీ!

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి   ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ గురువారం (జులై 4) భేటీ కానున్నారు.  త్వరలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రేవంత్ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి నిధులను కేటాయించాలని కోరారు. ఇప్పుడు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి రాష్ట్రసమస్యల పరిష్కారానికి కేంద్ర బడ్జెట్ లో ఇతోధికంగా నిధులు కేటాయించాల్సిందిగా కోరనున్నారు.

 అయితే సీఎం రేవంత్, మోడీ భేటీకి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు రేవంత్ మోడీతో భేటీ సందర్భంగా   రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన పలు రకాల అనుమతులు, లభించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్ర పథకాల నిధుల విడుదలలో నెలకొన్న జాప్యం తదితర పలు అంశాలపై  చర్చించనున్నారు.   పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బొగ్గు గనుల వేలంలో సింగరేణికి భాగస్వామ్యం కల్పించడం, సైనిక్ స్కూలు ఏర్పాటు, రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్రానికి అప్పగించడం, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉండిపోయిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గిరిజన వర్సిటీకి నిధుల కేటాయింపు.. ఇలాంటి అనేక సమస్యలను ఈ  సందర్భంగా రేవంత్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశమున్నది.