విజేతలను పరాజితులను వేరు చేసేది ఏంటి?

చాలా మంది విజయాన్ని సాధించాలని అనుకుంటారు. కానీ అధైర్యంతో వెనకడుగు వేస్తారు. విజయం సాధించాలంటే అందుకు కావలసింది ధైర్యమే కానీ అధైర్య పడటం కాదు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసుకోగల సామర్థ్యం మనలో వున్నప్పుడే విజయ శిఖరాలను చేరుకోగలగుతాము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకోవాలి. 

విజయాలు సాధిస్తే పొంగిపోతాడు కొందరు. కానీ విజయాలను సాధించినప్పుడు అణకువతో ఉండటమే అత్యత్తుమ సంస్కారం. విజయాన్ని సాధించాలంటే ప్రతీ మనిషి మొదట తన మీద తాను విజయం సాధించాలి. ఎక్కడ పుట్టాం, ఎలా పెరిగాం మొదలైన పరిస్థితుల్లాంటి పరిమితుల్ని ఛేదించుకుని బయటపడాలి. సంకల్ప బలంతో ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా మార్చగలం అనే నమ్మకం కలిగి వుండాలి.  కష్టే ఫలి అన్నారు పెద్దలు. అంటే కష్టపడనిదే ఏదీ సొంతం కాదు. కష్టపడకుండా మనకు ఏది లభించినా దాని విలువ మనకు తెలియదు. కష్టపడకుండా లభించిన దానిలో అంత థ్రిల్ కూడా వుండదు. ఆనందం ఏమీ వుండదు. అసలు అది విజయం కానేకాదు. దీన్ని బట్టి చూస్తే ఈకాలంలో ఎంతో మంది యువత సాధిస్తున్నది విజయమేనా అనే అనుమానం వస్తుంది.

విజయం సాధించడం అంటే అన్ని సమకూర్చగా దాన్ని తమ ఖాతాలో వేసుకుని విజయం సాధించామని చెప్పడం కాదు. సమస్యలతో రాజీలేని పోరాటం చేసి మనం అనుకున్న గమ్యం చేరాలి. కష్టాలను ఎదుర్కొని, పోరాడి విజేతలుగా రూపాంతరం చెందాలి. ఎవరైనా విజయం సాధించారు అంటే  వారికేముందిలే అన్ని సమకూరతాయి అని నిర్లక్ష్యంగా మాట్లాడతారు. కానీ తమ శక్తి సామర్థ్యాల ద్వారానే ఎదుటివారు విజయాలు  కైవసం చేసుకున్నారని గుర్తించనే గుర్తించరు. ఎందుకంటే మనకంటే గొప్పవారు, ప్రతిభావంతులు వున్నారని మనం అంగీకరించం గనుక. అలా అంగీకరించకపోవడమే మనిషిలో ఉన్న అహం. ఆ అహంతో మనిషి తానే గొప్ప అనుకుంటూ ఉంటాడు. 

విజయ పోరాటంలో సమస్యలు వస్తూనే వుంటాయి. ఆ సమస్యలను పరిష్కరించాలి తప్పితే వాటినే తలచుకుంటూ దిగులు పడటం అర్థంలేని వ్యాపకం అవుతుంది.  ఎందుకంటే ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం అనేది వుంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ వుండదు. ప్రతి చిక్కుకు ఒక చిట్కా వుంటుంది. అదేదో తెలుసుకొని, సరైన సమయంలో ప్రయోగించాలి. విశ్వాసం, నమ్మకం వున్నప్పుడే వాటి వెనకాల విజయం కూడా వుంటుంది.

సవాలు ఎంత పెద్దదైతే విజయమూ అంతే పెద్దది అయి వుంటుంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్న నానుడి పూర్తిగా నమ్మి జీవితాంతం దానిని ఆచరించి విజయాలు సొంతం చేసుకోవచ్చు. పోటీలు, పందాలు సవాళ్ళు చిన్నప్పటి నుంచి మనందరికీ ఎదురవుతాయి. చాలమందింపిల్లల్లో ఇలాంటి పెట్టి పాడు చేస్తున్నారు వారిని స్వేచ్ఛగా ఉండనివ్వడం లేదు అని అంటారు. కానీ అన్నీ మన మంచికే అని అనుకోవాలి. అలా అనుకుంటే ప్రతి పనిలో అనుభవం వస్తుంది కదా అనే విషయం కూడా తెలుసుకోగలుగుతారు. 

ఏ పనిని కూడా అసాధ్యం అని మన మనస్సులో చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే సాధ్యమనుకుంటే అన్నీ సాధ్యమే...! అసాధ్యమనుకుంటే అన్నీ అసాధ్యాలే...! విజేతలను, పరాజితులను వేరుచేసేది ఈ నమ్మకమే...!

                                        ◆నిశ్శబ్ద.

Related Segment News