మనిషి గురించి, కాలం గురించి జిడ్డు కృష్ణమూర్తి మాటలు!

ఓ గొప్ప శిష్యుడు భగవంతుని దగ్గరకు వెళ్లి తనకు సత్యబోధ చేయమని కోరిన కథను ఇక్కడ చెప్పుకోవాలి. పాపం! ఆ భగవంతుడు అన్నాడు.

'నాయనా, చాల ఎండగా వుంది, ఓ గ్లాసెడు మంచినీళ్లు తెచ్చిపెట్టు.' అని.

ఆ శిష్యుడు సరేనని చెప్పి ఓ యింటి ముందుకు వెళ్లి తలుపు తట్టాడు. ఓ సుందరాంగి తలుపు తెరిచింది. శిష్యుడు ఆమెను ప్రేమించడం జరిగింది. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. వారికి వివాహం అయింది, అనేక మంది పిల్లలు కూడా కలిగారు. ఒక రోజు విపరీతంగా వర్షం కురవసాగింది. రోడ్లన్నీ వరదలమయం అయినాయి. ఇళ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. శిష్యుడు భార్యను భుజాల మీదుగా ఎత్తుకుని, పిల్లలను చంకన వేసుకుని ఆ వరదలో పడి కొట్టుకుపోతూనే 'ఓ భగవంతుడా! నన్ను కాపాడు' అని ఎలుగెత్తి కేక వేశాడు. 

అప్పుడు భగవంతుడు శిష్యుడితో 'నేను అడిగిన మంచినీళ్లు యేవయ్యా?' అని అడిగాడు.

ఇది మంచి కథ. ఎందుకంటే, మనం చాలమందిమి ప్రతిదానినీ కాలక్రమేణ కాలప్రమేయంతో తూచుకుంటాము. మనిషి కాలం ఆధారంగా జీవిస్తాడు. అతని పలాయన వాదంలో భవిష్యత్తును రూపొందించుకోవడం ఓ మంచి ఎత్తు.

మనలో మార్పులన్నీ కాలానుగుణంగా కాలక్రమేణ వస్తాయని అనుకుంటాము. క్రమతను మనలో కొద్దికొద్దిగా క్రమక్రమంగా రూపొందించుకోవచ్చునని  అనుకుంటాము. కాని కాలం క్రమతనుగానీ శాంతిని గానీ తీసుకురాదు. అందుచేత ఏదో కాలక్రమేణ జరుగుతుంది సుమా అన్న విషయం మనం మరచిపోవాలి. అంటే, రేపు అనే రోజు ఒకటి ఉందనీ అప్పుడు ప్రశాంతంగా వుంటామనీ అనుకోగూడదు. మనం ఈ క్షణంలోనే, యిప్పుడే క్రమంలో వుండిపోవాలి.

నిజంగా ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడు కాలం అంతర్ధానమైపోతుంది కదూ? అప్పుడు తక్షణ చర్య వుంటుంది. అయితే, మనకున్న అనేక సమస్యల తాలూకు ప్రమాదాన్ని మనం పసికట్టం, అందుచేత వాటినుంచి తట్టుకోవటానికి సమయం, కాలం అనే సాధనాన్ని కల్పించుకుంటాం, అన్వేషిస్తాం. సమయం మనకేమి సహాయం చేయదు. పైగా దగా చేస్తుంది. మనలో మార్పు తీసుకురాదు. సమయం అనేదానిని గతం, వర్తమానం, భవితవ్యం అని భాగాలు చేసుకున్నాడు మనిషి. ఈ విభాగాలు చేసుకున్నందువల్ల సంఘర్షణ తప్ప యింకేమి సంప్రాప్తం కావడం లేదు.

నేర్చుకోవడం అనేది కూడా కాలక్రమేణ జరిగే పనేనా? వేల సంవత్సరాల తరువాత కూడా మనం ఒకళ్ల నొకళ్లం చంపుకోవడం, అసహ్యించుకోవడం కంటే వేరయిన సక్రమ జీవన విధానం వున్నదని నేర్చుకోలేకపోయాము. కాలానికి సంబంధించిన సమస్య చాల ముఖ్యము. జీవితాన్ని రాక్షసమయము, అర్థ విహీనము చేసుకున్న మనం యే సమస్యనయినా పరిష్కరించుకోవాలనుకుంటే, ముఖ్యంగా ముందుగా కాలాన్ని గురించిన విషయమే ప్రస్తావించుకోవాలి.

మనం లోగడ ప్రస్తావించుకుని, గమనానికి తెచ్చుకున్న తాజాతనం, అమాయకత్వంతో కూడిన మనసుతో మటుకే చూచి, కాలాన్ని అర్థం చేసుకోగలమనే సంగతి ముందు గ్రహించగలగాలి. అనేక సమస్యలు మనను గందరగోళ పరుస్తున్నాయి. మనం యీ గందరగోళంలో చిక్కుకుపోయాము. ఒక అడవిలో దారి కనబడక చిక్కుకుపోయామనుకోండి, అప్పుడు యేం చేస్తాం? ఉన్న చోట ఆగిపోతాం. ముందుగా మనం చేసే పని యిదీ. ఆగిపోయి, చుట్టూ పరికించి చూస్తాం. అయితే, మనం గందరగోళంలో ఎక్కువగా  చిక్కుకుపోయాం కాబట్టి, జీవితంలో దారి కనబడక యిరుక్కుపోయాం కాబట్టి  మనం యేం చేస్తున్నామంటే: అటుయిటు పరుగులు తీస్తున్నాం, వెదుకులాడుతున్నాం, అడుగుతున్నాం, దబాయిస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. అందుచేత మొదటి విషయం యేమిటంటే - మనం చేయవలసిన మొదటి పని యేమిటి అనే విషయం గురించి సాగే ఆలోచనలో పడిపోయిన మనం అంతరంగికంగా మనం అగిపోవాలి ముందు. అంతరంగికంగా అగిపోయినప్పుడు, మానసికంగా నిశ్చలంగా వున్నప్పుడు  మనసు ప్రశాంతంగా తయారవుతుంది, స్పష్టత యేర్పడుతుంది. అప్పుడు ఈ కాలపు ప్రశ్నను గురించి జాగ్రత్తగా గమనించవచ్చును.

ఇదీ జిడ్డు కృష్ణమూర్తి గారు మనిషి గురించి, కాలం గురించి, మనిషి కాలం విషయంలో చేస్తున్న ఆలోచన గురించి ఇచ్చిన వివరణ.

                                    ◆నిశ్శబ్ద.