సలహాలు ఇవ్వడం ఎంతవరకు మంచిది?

'సలహా ఇచ్చేవాడు బుద్ధిహీనుడు' అంటారు శ్రీ జిడ్డుకృష్ణమూర్తిగారు. అంటే ఆయన ఉద్దేశం ఎవరైనా ' మీ అనుభవంలో షేవ్ చేసుకోవడానికి ఏ బ్లేడు మంచిదంటారు?' అని అడిగినప్పుడు ఏమీ చెప్పకుండా ఉండాలని కాదు, అలాగే ఒక చోటినుండి మరో చోటికి వెళ్ళడానికి ఏ రూటు బస్సుల్లో ఏదెక్కి వెళ్తే త్వరగా చేరే అవకాశముంటుంది అని అడిగినప్పుడు సలహా చెప్పకూడదని కాదు, జీవితంలో ముఖ్యమైన సమస్యలు అనగా వివాహం చేసుకోవాలా, చేసుకోవడం మానేయాలా లేక ప్రొఫెసర్ ఉద్యోగానికి వెళ్ళమంటారా అని ఎవరైనా సలహా అడిగితే ఇలాంటి సమస్యలకు ఎవరికి వారే సరిగా ఆలోచించుకొని సరైన నిర్ణయం చేసుకోవాలని వారి అభిప్రాయం. ఈ విషయాల్లో సలహాలివ్వాలనుకున్నవాడు చివరకు చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది.

ఇలాంటి వాటిలో ఎవరైనా వచ్చి అడిగినప్పుడే సలహా ఇవ్వడం మంచిది. కాదని అనుకున్నప్పుడు ఇక అడగక ముందే సలహా ఇవ్వజూడడం మరీ అధ్వాన్నమని వేరే చెప్పనక్కరలేదు. ఒకాయనకు "ఫలాని సినిమా చూచి రావోయ్ చాలా బాగుంది" అని సలహా ఇచ్చాడు అతడి మిత్రుడు. అతడి ఆర్థిక ఇబ్బందులు ఏమిటో తెలుసుకోకుండా ఈ సలహా తొందరపడి ఇచ్చాడని చెబుతున్నట్టుగా అతను  ఎగాదిగా చూసి "ఈ సారి ఇలాంటి సలహాలిచ్చేప్పుడు, సలహాతోబాటు నాకూ నా ఫామిలీకి టిక్కెట్లకు సరిపడే డబ్బుకు ఒక చెక్కు రాసి పంపించు" అన్నాడు. ఆ మాటలు ఆ సలహా ఇచ్చిన సదరు స్నేహితుడి నసాళానికి అంటటంతో ఇలా ఇతరులకు ఉచిత సలహాలివ్వకూడదు అని అప్పటి నుండి సలహాలు ఇవ్వడం ఆపేసాడు. 

పిచ్చుక గూడు కట్టుకునప్పుడు దాని ద్వారాన్ని క్రిందివైపుగా ఉంచుతుంది. అందువల్ల వర్షం పడినా ఒక్క చుక్క కూడా ఆ గూట్లోకి వెళ్ళకుండా ఆ గూడెప్పుడూ చక్కగా పొడిగా వుంటుంది. బోరున వర్షం కురిసిన ఒకనాడు ఒక పిచ్చుక తన గూటిలో తలదాచుకొని, వర్షం వెలసిన తర్వాత తిన్నగా బయటికి వచ్చి ఒక ఇంటి కప్పుమీద వాలింది. పక్కనే ఒక చెట్టుకొమ్మమీద ఒక కోతి కనిపించింది. కోతికి గూడు నిర్మించుకునే ఆనవాయితీ లేనందువల్ల, వర్షం పడేప్పుడు కూడా అది ఏ చెట్ల కొమ్మలమధ్యో కూచొని అలాగే తడుస్తూ వుంటుంది. చప్పగా తడిసి విచారగ్రస్తమైన మొహంతో కూచున్న కోతిని చూచి ఆ పిచ్చుక దానిస్థితికి జాలిపడి "మిత్రమా నిన్ను చూస్తే నాకు బాధగా ఉంది. నాకుండేదల్లా ఈ ముక్కొక్కటే, అయినప్పటికీ నేనా ముక్కు సహాయంతోనే ఇంత చక్కటి గూడు కట్టుకున్నాను. నీకు చూస్తేనా, మనిషికుండే చేతులూ కాళ్ళూ అనే నాలుగంగాలు ఉండటమే కాక తోక కూడా ఒకటుంది. వీటన్నిటి సహాయంతో నీవో చిన్న నివాసం సులభంగా ఏర్పరుచుకోవచ్చు. అప్పుడు నువ్వీ విధంగా ముద్దగా తడిసిపోవలసిన అవసరముండదు కదా” అన్నది.

సద్బుద్ధితో పిచ్చుక ఇచ్చిన ఈ సలహాను కోతి అపార్థం చేసుకున్నది. తనని ఆటలు పట్టించి ఏడ్పించడానికే ఈ పిచ్చుక ఇలా మాట్లాడుతున్నది అని భావించింది. “నీకు మంచి గూడున్నదనీ అందువల్ల నీవు తడవలేదనీ నీకు మహా మిడిసిపాటుగా వున్నట్లుంది. నేను వర్షంలో తడిశానని నన్ను వెక్కిరించడానికి ఆ గూటిలో నుండి ఈ ఇంటి కప్పుమీదికి ఎగిరి వచ్చావన్న మాట. మహా ఎగిరి పడుతున్నావ్, నీ గర్వమణుస్తాను ఆగు" అని అంటూ ఒక్క దుముకు దుమికి ఆ పిచ్చుక గూడును చిందరవందర చేసి నాలుగు వైపులా పారేసింది. "పైసారి వర్షం వచ్చినప్పుడు నాతో బాటు నువ్వూ తడుద్దుగాని” అని హూంకరిస్తూ వెళ్ళిపోయింది.

"మనుష్యుల్లో కూడా ఈ కోతి మనస్తత్వం చాలా మందిలో కనిపిస్తుంది” అంటారు స్వామి సచ్చిదానంద. “అలాంటి వారెవరితోనైనా “పోనీ ఇట్లా చేస్తే...”. అని మనం అనే లోగానే వారికి మనమీద చెప్పరాని ఆగ్రహం కలుగుతుంది. అందుచేత వారి గతికి వారిని వదిలివేయడమే శ్రేయస్కరం. అయాచితంగా వారికి సలహాలివ్వవద్దు. వారంతట వారు వచ్చి అడిగేంతవరకూ ఏమీ చెప్పద్దు. చిరునవ్వుతో ముందరికి సాగిపోతూవుండటమే మంచిది.”

                                    ◆నిశ్శబ్ద.

Related Segment News