ఏపీ బీజేపీ కంటే టీఎస్ బీజేపీయే నయమా?



భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య స్నేహం గత ఎన్నికల నుంచి కొనసాగుతోంది. కేంద్రంలో బీజేపీ తన మిత్రధర్మాన్ని పాటిస్తూ తనకు పూర్తి మెజారిటీ వున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి కూడా మంత్రి పదవులు ఇచ్చింది. ఏపీలో కూడా టీడీపీ బీజేపీ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చింది. ఈ స్నేహం ఇలాగా కొనసాగుతూ వుంటే చూడముచ్చటగా వుంటుంది. కానీ ఏపీ బీజేపీలో కనిపిస్తున్న ధోరణులు స్నేహధర్మానికి విరుద్ధంగా వున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ నాయకులు చేస్తున్న ‘మిత్రభేద’ పనులు కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జరుగుతున్నాయా, లేక ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఇక్కడి నాయకులే అలా వ్యవహరిస్తున్నారా అన్న విషయాలను అలా వుంచితే ఏపీ బీజేపీ టీడీపీ విషయంలో స్నేహితుడిలా వ్యవహరించడం లేదన్నది స్పష్టమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సోము వీర్రాజు లాంటి నాయకుల నోటి వెంట నుంచి వస్తున్న మాటలు స్నేహాన్ని తుంచేలా వున్నాయే తప్ప పెంచేలా లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీడీపీతో స్నేహం విషయంలో ఏపీ బీజేపీ కంటే తెలంగాణ బీజేపీయే చాలా నయమని పరిశీలకులు అంటున్నారు.

తెలంగాణ బీజేపీలోని నాయకత్వానికి బీజేపీ టీడీపీతో స్నేహం చేయడం మొదట్లో ఇష్టం లేదు. అయితే  ఆ తర్వాత వారి ధోరణిలో మార్పు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ - టీడీపీల మధ్య సహకార ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ మీద పోరాటం చేసే విషయంలో ఈ రెండు పార్టీలూ ఐక్యతను ప్రదర్శిస్తున్నాయి. అలాగే త్వరలో జరగబోతున్న వరంగల్ ఉప ఎన్నికల విషయంలో కూడా ఈ రెండుపార్టీల మధ్య మంచి కో ఆర్డినేషన్ వుంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించే విషయంలో రెండు పార్టీలూ నిరంతరం చర్చించుకుంటూ స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణలో పరిస్థితి అలా వుంటే, ఏపీలో మాత్రం మిత్రపక్షంగా వుంటూ, మంత్రివర్గంలో వుంటూ ప్రభుత్వం మీదే విమర్శలు చేసే స్థాయిలో బీజేపీ ‘స్నేహపూర్వక ధోరణి’ వుంది. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నుంచి ఏపీ బీజేపీ నేర్చుకోవాల్సింది చాలా వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu