బట్టతల కారణంగా పెళ్లి క్యాన్సిల్.. మనస్థాపంతో యువ వైద్యుడి బలవన్మరణం
posted on Mar 27, 2025 11:32AM
వయసు మీద పడుతున్నా తనకు పెళ్లి కావడం లేదన్న మనో వ్యధతో సికింద్రాబాద్ లో ఓ యువవైద్యుడు బలవర్మణానికి పాల్పడ్డాడు. వివరాల్లో వెళితే గుజరాత్ కు చెందిన ప్రకాశ్ మాల్ బతుకుదెరువు కోసం దశాబ్దాల క్రితమే సికింద్రాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. అయితే చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ ను బాగా చదివించి డాక్టర్ చేశాడు. బస్తీ దవాఖానాలో డాక్టర్ గా పని చేస్తున్న పురోహిత్ కిషోర్ కు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థ వేడుక కూడా ఘనంగా జరిగింది. అప్పటివరకు విగ్ ధరించి మేనేజ్ చేసిన పురోహిత్ పూజారీ ఈ వేడుకలోనే తన బట్టతల బయటపడటంతో అమ్మాయి కుటుంబం పెళ్లి క్యాన్సిల్ చేసింది. చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు వెతుకుతున్నప్పటికీ పురోహిత్ పూజారీకి అమ్మాయిని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీనికి ప్రధాన కారణం అతడికున్న బట్టతల. రాకరాక వచ్చిన ఈ సంబంధం కూడా నిశ్చితార్థం తర్వాత క్యాన్సిల్ కావడంతో అబ్బాయి తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు . బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోని క్యావలరీ బ్యారక్ రైల్వేస్టేషన్ వద్ద రైలు క్రిందపడి చనిపోయాడు. గుర్తింపు కార్డులో పురోహిత్ పూజారీ డిటైల్స్ ఉండటంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జీవితంలో అన్ని ఎత్తు పల్లాలను అధిగమించిన ఈ యువ డాక్టర్ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తీవ్ర విషాదాన్ని నింపింది.