వరంగల్: ఎవరి ఆనందం వారిది!



వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రస్తుతం ప్రచార పర్వం మొదలైంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్, కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ, టీడీపీ - బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ దేవయ్య, వైసీపీ అభ్యర్థిగా నల్లా సూర్య ప్రకాష్, వామపక్షాల అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్ రంగంలో నిలిచారు. ఇక ఇండిపెండెంట్ల లిస్టు చాలా పెద్దగా వుంది. నామినేషన్ల ఉప సంహరణ నాటికి ఈ లిస్టు బాగా తగ్గే అవకాశం వుంది. మొత్తంమీద ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఐదుగురు రంగంలో వున్నారు. ఈ స్థానాన్ని మరోసారి  గెలవాలని టీఆర్ఎస్ పట్టుదలగా వుండగా, ఈ స్థానాన్ని తామే గెలవటం ద్వారా టీఆర్ఎస్ దూకుడుకు కళ్ళెం వేసి, తమ సత్తా చాటాలని మిగతా పార్టీలు వున్నాయి.   అన్ని పార్టీలూ ఇప్పటికే ప్రచారం ప్రారంభించేశాయి. ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలూ ఒకే మాట పదేపదే అంటున్నాయి. ఆ మాట ఏమిటంటే, ‘‘ఈ ఎన్నికలో టీఆర్ఎస్ - మా పార్టీ మధ్యే ప్రధానమైన పోటీ వుంటుంది’’.

ఇలా అన్ని పార్టీలు టీఆర్ఎస్‌నే టార్గెట్ చేయడంతోపాటు టీఆర్ఎస్‌కి తమ పార్టీనే ప్రధాన ప్రత్యర్థి అని చెప్పుకుంటూ ఆనందపడిపోతున్నాయి. ఇలా ఎవరికి వారు ఎవరి ఆనందం వారు పడిపోతూ వీరంతా కలిసి టీఆర్ఎస్‌కి ఉపయోగపడతామనే విషయాన్ని విస్మరిస్తున్నారు. దానితోపాటు తమ పార్టీయే టీఆర్ఎస్‌కి ప్రధాన పోటీ అని చెప్పుకోవడం కూడా కాస్తంత ఎక్కువ బిల్డప్పు అనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ -బీజేపీ అభ్యర్థులు అలా చెప్పుకుంటే సరే పర్లేదని అనుకోవచ్చుగానీ, చివరికి వైసీపీ అభ్యర్థి, వామపక్షాల అభ్యర్థి కూడా ఇదే మాట చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ వుండటం విచిత్రంగా అనిపిస్తున్న విషయం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu