చెప్పు విసిరితే తప్పేంటి?



వరంగల్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీద కొమురయ్య అనే రైతు చెప్పు విసరడం సంచలనం సృష్టించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని, రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతోందని ఆగ్రహంతో కొమురయ్య చెప్పు విసిరాడు. ఒకపక్క రైతులు తమ ఉసురు తీసుకుంటూ వుంటే, ఆ సమస్య పరిష్కారం సంగతి తెలంగాణ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే పదిహేను వందల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.  ఈ అంశాన్ని పక్కన పెట్టి, రాజకీయ గేమ్‌లో భాగంగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన కడియం శ్రీహరి ఇప్పుడు మళ్ళీ మా పార్టీ అభ్యర్థినే గెలిపించండీ అంటూ రైతుల దగ్గరకి ప్రచారానికి వెళ్ళడం ఏ రైతుకైనా ఆగ్రహం తెప్పించే విషయమే. సాధారణంగా తెలంగాణ రైతులు మనసులో కుమిలిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతూ వుంటారు. అయితే కొమురయ్య ధైర్యంగా చెప్పు విసిరాడు. దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే చెప్పు విసిరిన రైతు బిడ్డ కొమురయ్య ఆవేదనను అర్థం చేసుకోకుండా అతన్ని ‘సైకో’ అనడం అన్యాయం.

సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు మధ్యలో ఇలా చెప్పులు విసరడం, నినాదాలు చేయడం ‘సైకో’తనం అయితే మరి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎన్నో ఆటంకాలు సృష్టించారు. వారిని అప్పుడు టీఆర్ఎస్ నాయకులు హీరోలని పొగిడారు. అలా ఆటంకాలు సృష్టించిన వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు, ప్రమోషన్లు ఇచ్చారు. మరి ఇప్పుడు చెప్పు విసిరిన కొమురయ్య సైకో ఎలా అయ్యాడో కడియం శ్రీహరి గారే చెప్పాలి. తెలంగాణ బిడ్డలు సున్నిత హృదయులు వారి ఆవేదనను, ఆగ్రహాన్ని తీవ్రంగానే వ్యక్తం చేస్తారు. ఆ విషయాన్ని తెలంగాణ బిడ్డ అయిన కడియం శ్రీహరి గ్రహించకపోవడం ఎంతమాత్రం బాగాలేదు. ఒక్కొక్కరు తమ ఆవేశాన్ని, ఆవేదనను ఒక్కో రకంగా వ్యక్తంచేస్తూ వుంటారు. కొమురయ్య తన ఆవేదనను చెప్పు విసరడం ద్వారా వ్యక్తం చేశాడు. అంచేత, ఇప్పటికైనా చెప్పు విసిరిన కొమురయ్య మనసులోని ఆవేదనను కడియం శ్రీహరి అర్థం చేసుకోవాలి. అలా చెప్పు విసరడం ఎంతమాత్రం తప్పు కాదని కడియం బహిరంగంగా ప్రకటించాలి. కొమురయ్యను సైకో అన్నందుకు సారీ చెప్పాలి.