పోసాని విడుదలపై వీడని ఉత్కంఠత
posted on Mar 21, 2025 6:09PM
నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళికి తాత్కాలికంగా రిలీఫ్ లభించినప్పటికీ విడుదలపై ఉత్కంఠత నెలకొంది. కూటమి నేతలపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎపిలో 17 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మొత్తం ఐదు కేసులో బెయిల్ లభించినప్పటికీ పోసాని విడుదల కాలేదు. తాజాగా గుంటూరు కోర్టు సిఐడి కేసులో బెయిల్ లభించింది. పోసానిని గత నెలలో ఓబులాపురం పోలీసులు హైద్రాబాద్ నివాసంలో అరెస్ట్ చేసి రాజంపేట జైలుకు తరలించారు. పిటి వారంట్ పై నరసారావుపేట పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు జైలుకు రిమాండ్ చేశారు. తర్వాత ఆదోని పోలీసులు పిటి వారెంట్ పై అరెస్ట్ చేసి కర్నూలు జైలుకు తరలించారు. గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ పై అరెస్ట్ చేసి గుంటూరు జైలుకు రిమాండ్ చేశారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పోసాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆయనకు చుక్కెదురైంది. సిఐడి నమోదు చేసిన కేసులో గుంటూరు సిఐడి కోర్టు పోసానికి బెయిల్ ఇచ్చింది. లక్ష రూపాయల పూచీకత్తు, రెండు జామీన్లు కోర్టుకు ఆయన సమర్పించాల్సి ఉంటుంది. ప్రతీ రెండు వారాలకు సిఐడి కార్యాలయానికి హాజరు కావాలి.