పాపం... టీఆర్ఎస్ నాయకులు!
posted on Nov 10, 2015 8:00PM

ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు టీఆర్ఎస్ నాయకులతో ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అంటున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. అధికార టీఆర్ఎస్ ఈ స్థానాన్ని మళ్ళీ గెలుచుకోవాలని కృషిచేస్తూ వుండగా, ఈ స్థానంలో గెలవటం ద్వారా టీఆర్ఎస్‌కి చెక్ పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ లక్షంతో అధికార ప్రతిపక్షాలు ఎన్నికల బరిలో దిగి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం ప్రచారం కోసం నియోజకవర్గంలో భయపడుతూనే తిరుగుతున్నారు. ప్రజల నుంచి టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులకు ఎదురవుతున్న వ్యతిరేకతే దీనికి కారణం.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మొన్నామధ్య వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఒక రైతు ఆయన మీదకి చెప్పు విసిరి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. టీఆర్‌ఎస్ నాయకుల మీద ప్రజలు తిరగబడటం అంతకుముందు అనేక సందర్భాలలో జరిగింది. కడియం శ్రీహరి మీద చెప్పు విసరడం మాత్రం పరాకాష్ట. ఆ తర్వాత నియోజకవర్గంలో పలు సందర్భాలలో టీఆర్ఎస్ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. పదిహేడు నెలల పదవీ కాలంలో ఏం చేశారని ఆవేశపూరిగా ప్రజలు ప్రశ్నిస్తూ వుండటంతో టీఆర్ఎస్ నాయకులు నోట మాట లేకుండా వుండిపోతున్నారు. నాయకులను ఇలా నిలదీసే సంప్రదాయాన్ని టీఆర్ఎస్ నాయకులే పెంచి పోషించారని, ఇప్పుడు వారే ఈ సంప్రదాయం బారిన పడ్డారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.