మీ సర్వేలు సల్లంగుండ!



బీహార్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సర్వేలు చేసే సంస్థలు, సర్వేలు జరిపించే మీడియా సంస్థలు బోర్లా పడ్డాయి. ఆ సంస్థ ఈ సంస్థ అనే తేడా లేకుండా అన్ని సర్వేలూ దిక్కుమాలిన సర్వేలని తేలిపోయాయి. పకడ్బందీగా, శాస్త్రీయంగా సర్వేలు చేస్తామని బోలెడంత బిల్డప్పులు ఇచ్చి సర్వే ఫలితాలను వెల్లడించిన సంస్థలన్నీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన తర్వాత నోళ్ళు తెరిచాయి. ఇప్పుడు ప్రతి సంస్థా తమ సర్వే విఫలం కావడానికి ఫలానా కారణం ఫలానా కారణం అంటూ వివరణలు ఇచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

బీహార్లో తుది విడత పోలింగ్ పూర్తి కాగానే దాదాపు ఓ పది సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంటూ ఎన్నికల సర్వేలను వెల్లడించాయి. ఈ సంస్థల్లో ఎక్కువ సంస్థలు మహా కూటమికి బొటాబొటి మెజారిటీ వచ్చే అవకాశం వుందని చెప్పాయి. మరికొన్ని సంస్థలు హంగ్ తప్పదన్నట్టుగా చెప్పాయి. ఈ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో బీజేపీకి వంద సీట్లకు పైగా వచ్చే అవకాశం వుందని చెప్పుకొచ్చాయి. ఆ మర్నాడు ఎన్డీటీవీ సంస్థ బీజేపీ ఈ ఎన్నికలలో ఇరగదీసేస్తుందని ఓ సర్వే విడుదల చేసింది. చివరికి ఏమైంది... ఏ సర్వే కూడా నిజం కాలేదు. బీజేపీ కుప్పకూలింది. మహా కూటమి ఊహించని మెజారిటీ సాధించింది. భారత ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారి సర్వేలు ఘోరంగా విఫలమైన సందర్భం ఆవిష్కృతమైంది. ఎందుకూ పనికిరాని సర్వేలు చేసిన సంస్థలు ఇప్పుడు లెంపలు వేసుకోవడం మొదలుపెట్టాయి. మేం ఇలాంటి దిక్కుమాలిన సర్వే ఎందుకు వెల్లడించామంటే అంటూ ఏవేవో కుంటి సాకులు చెప్పడం ప్రారంభించాయి. ఇప్పుడు సర్వేల సంస్థల పాట్లను చూసి రాజకీయ నాయకులు నవ్వుకుంటున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu