ఫ్లై ఓవర్లు ఎలుక తోకలా? టూమచ్!



కొంతకాలం తన ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుని మళ్ళీ హైదరాబాద్‌కి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో వివాదాస్పద వ్యాఖ్యతో రాజకీయ వర్గాలను కదిలించారు. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సమైక్య పాలనలో హైదరాబాద్ నాశనం అయిపోయిందన్నట్టుగా మాట్లాడారు. హైదరాబాద్‌ని బాగు చేసుకోవాల్సిన అవసరం వుందన్నట్టుగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో వున్న ఫ్లై ఓవర్లను ఎలుక తోకలుగా అభివర్ణించారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణలోని రాజకీయ వర్గాలు తప్పు పడుతున్నాయి. కేసీఆర్ ఈ తరహా మాటలను మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా వున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఫ్లై ఓవర్లు కొన్ని తెలుగుదేశం హయాంలో, మరికొన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో రూపొందాయి. ఇప్పుడు కేసీఆర్ ఫ్లై ఓవర్లను ఎలుక తోకలతో పోల్చడం పట్ల ఈ రెండు పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో వున్న జనం చప్పట్లు కొట్టాలన్నట్టుగా, నవ్వుకోవాలన్నట్టుగా  ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తం మాట్లాడ్డం భావ్యంగా లేదని అంటున్నారు. కేసీఆర్ హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిని, ఆ అభివృద్ధిని చేసిన పార్టీలను కించపరిచేలా మాట్లాడ్డం టూమచ్‌గా వుందని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu