ఇక స్క్రాప్ మీద టీఆర్ఎస్ దృష్టి

 

ఆపరేషన్ ఆకర్ష పథకం ద్వారా మొన్నటి వరకూ తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ తదితర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను గుంజుకున్న టీఆర్ఎస్ భవిష్యత్తులో మరికొంతమంది ఎమ్మెల్యేల మీద ఆకర్ష పథకాన్ని ప్రయోగించే అవకాశం లభించడం లేదు. రేవంత్ రెడ్డి వ్యవహారం తర్వాత టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యేల వలస ఇక నిలిచిపోయినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేని తమ పార్టీలోకి జంప్ చేయించుకున్నా అది తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే అవకాశం వుందని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ అమలు చేసిన ఆకర్ష పథకం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి చేసింది నేరం అయితే, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నిధులు ఆశ చూపించి తమ పార్టీలోకి లాక్కున్న టీఆర్ఎస్ నాయకులు చేసింది కూడా నేరమేనన్న అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, రేవంత్ రెడ్డి చేసింది తప్పే అయితే, టీఆర్ఎస్ చేసింది అంతకు వందల రెట్లకు మించిన తప్పు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కాకుండా వివిధ పార్టీల్లో మిగిలిపోయిన డి.శ్రీనివాస్ లాంటి స్క్రాప్‌ని టీఆర్ఎస్‌లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. వైసీపీకి చెందిన ఒక లేడీ మాజీ ఎమ్మెల్యేగారు కూడా త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇదే తరహాలో వివిధ పార్టీల్లో పనీపాటా లేకుండా, పదవి లేకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న రాజకీయ నిరుద్యోగులను భారీ సంఖ్యలో టీఆర్ఎస్‌లోకి చేర్చుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు.