హేట్సాఫ్ టీడీపీ

 

తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ  నాయకులు, కార్యకర్తలు మనస్పూర్తిగా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. చాలా రాజకీయ పార్టీలు కార్యకర్తలను, నాయకులను కూరలో కరివేపాకులా వాడుకుని అవతల పారేస్తూ వుంటాయి. అయితే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీది కార్యకర్తలను, నాయకులను గుండెలో పొదువుకుని కాపాడుకునే పార్టీ. అందుకే తెలుగుదేశం పార్టీని తాలు, వేస్టేజీ లాంటి నాయకులు వదలి వెళ్ళిపోయారే తప్ప అసలైన నాయకులు, కార్యకర్తలు పార్టీకి ఎప్పుడూ వెన్నంటే వున్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల కృతజ్ఞతను కనబరుస్తూనే వున్నారు. పార్టీ పదేళ్ళపాటు అధికారంలో లేని సమయంలో కూడా పార్టీ జెండాలు భుజాన పెట్టుకుని మోశారు. అధికార పార్టీల కుయుక్తులను ఎదుర్కుంటూ పోరాటాలు చేశారు. అలాంటి కార్యకర్తలు, నాయకుల పట్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శిస్తూనే వుంటుంది. అందుకే పార్టీ నాయకత్వానికి, పార్టీ శ్రేణులకు మధ్య వున్న ఆత్మీయతానుబంధం నిరంతరం పెరుగుతూనే వుంటుంది. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల కోసం, వారి రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచంలోని ఏ పార్టీ చేయడం లేదని చెప్పుకోవచ్చు. పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎంత అండగా వుంటుందో తాజాగా జరిగిన రేవంత్ రెడ్డి ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా పన్నిన కుట్రలో రేవంత్ రెడ్డి ఇరుక్కున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఆయనకు, ఆయన కుటుంబానికి అండగా నిలిచిన తీరు ఆ పార్టీ కార్యకర్తల చేత హేట్సాఫ్ చెప్పించుకుంటోంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మద్దతు కారణంగానే రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబం ఎంతో ధైర్యంగా సమస్యను ఎదుర్కొన్నారు. పార్టీ ఇచ్చిన ధైర్యమే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పన్నిన పద్మవ్యూహంలోంచి పాక్షికంగా బయటపడటానికి కారణమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బెయిల్ ద్వారా విడుదలైన శుభ సందర్భంలో కార్యకర్తలు అందరూ తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డికి అండగా నిలిచిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. జైలు నుంచి బయటకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో కూడా ఆయనకు తెలుగుదేశం పార్టీ మీద వున్న కృతజ్ఞతాభావం ఎంతో స్పష్టంగా కనిపించింది.