బియ్యం మాయం కేసు.. పేర్ని దంపతులకు తప్పించుకునే దారి లేదు!

అడ్డగోలుగా అవినీతికి పాల్పడి.. తీరా అది బయటపడేసరికి తమదేం లేదు.. అంతా తమ వద్ద పని చేసేవారే చేశారంటూ బుకాయించి తప్పించుకోవడానికి మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న ప్రయత్నాలు ఫలింలేలా లేవు. సొంతంగా ఓ గోడౌన్ నిర్మించి దానికి పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చి.. ఇటు అద్దె సొమ్ములు తీసుకోవడమే కాకుండా, ఆ గోడౌన్ లో  పౌర సరఫరాల శాఖ నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మాయం చేసిన కేసులో పేర్ని నాని, ఆయన సతీమణి జయసుధా పూర్తిగా ఇరుక్కున్నారు.

ఈ కేసులో పేర్ని నాని భార్యకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయగా, పేర్ని నానికి తాత్కాలిక ఊరట లభించింది. అయితే పేర్ని నాని సతీమణిని పోలీసుల విచారణకు సహకరించాల్సిందేనని ఆదేశించింది. దీంతో పోలీసుల నోటీసుల మేరకు ఆమె విచారణకు హాజరై.. బియ్యం మాయం విషయం తనకేమీ తెలియదనీ, గోడౌన్ వ్యవహారాలన్నీ ఆ గోడౌన్ మేనేజన్  మానస్ తేజ్ చూసుకుంటారనీ చెప్పి చేతులు దులిపేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ కేసు వ్యవహారం వెలుగులోనికి వచ్చినప్పటి నుంచీ పేర్ని నాని కూడా దాదాపుగా ఇవే మాటలు చెబుతున్నారు. గోడౌన్ వ్యవహారాలను రోజువారీగా చూసుకునే తీరిక తనకు కానీ తన భార్యకు కానీ లేదనీ, ఉద్యోగులకే ఆ బాధ్యత అప్పగించేశామని చెప్పుకొస్తున్నారు. 

నిజమే గోడౌన్ వ్యవహారాలన్నీ మేనేజరే చూసుకుంటే.. మరి మాయమైన బియ్యానికి సంబంధించి ఫెనాల్టీ సొమ్ము నాని కుటుంబం ఎందుకు చెల్లించినట్లు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక పేర్ని నాని మీడియా సమావేశంలో తడబడ్డారు. అయినా తమ తప్పు లేదనీ, అంతా మేనేజరే చేశాడనీ చెప్పుకోవడానికి, ప్రజలను, పోలీసులను నమ్మించడానికి పేర్ని దంపతులు నానా తంటాలూ పడుతున్నారు. ఇప్పటికే గోడౌన్ మేనేజన్ మానస్ తేజ అరెస్టై జైలులో ఉన్నాడు. అతనిని విచారించిన తరువాతే పోలీసులు ఈ కేసులో ఎ6గా పేర్ని నానిని చేర్చారు. ఇంత జరిగిన తరువాత నయానో భయానో మేనేజన్ మానస్ తేజ్ చేత పేర్ని కుటుంబానికి బియ్యం మాయంతో ఏం సంబంధం లేదు, అంతా తనదే బాధ్యత అని చెప్పించినా ఆశ్చర్యపోవలసిన పని లేదు.

అయితే ఇక్కడ మాయం అయిన బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించేశారు. అక్కడ నుంచి అక్రమంగా దేశం కూడా దాటించేశారు. ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయంటున్నారు పోలీసులు. అంతే కాదు.. బియ్యం అమ్ముకున్న డబ్బులు మేనేజర్ మానస్ తేజ్ ఖాతాలోనే జమ అయ్యాయి. అయితే ఆయన ఖాతా నుంచి పేర్ని కుటుంబానికి బదిలీ అయ్యాయి. అదీ ఫోన్ పే ద్వారానే బదలీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలూ పోలీసులు సేకరించారు. అంతా మేనేజరే చేసి, బియ్యం మాయం చేసి అమ్ముకుంటే.. ఆ సొమ్ములు పేర్ని కుటుంబానికి ఎందుకు చేరాయన్నదానికి ఆయన సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఎంతగా తమ తప్పు లేదనీ, తామేం పాపం ఎరుగమంటూ నంగనాచి కబుర్లు చెప్పినా వారికి సొమ్ములు ముట్టినట్లు పోలీసులు స్పష్టమైన ఆధారాలు సేకరించడంతో  పేర్ని నాని కానీ, ఆయన భార్య కానీ ఈ కేసులోంచి తప్పించుకునే అవకాశాలు లేవని న్యాయనిపుణులు అంటున్నారు.

అయినా బియ్యం మాయం బాగోతం బయటపడిన తరువాత.. కోర్టులో ముందస్తు బెయిలు వచ్చే వరకూ పేర్ని జయసుధ, పేర్ని నాని అజ్ణాతంలోకి వెళ్లిపోవడమే ఈ వ్యవహారంలో వారు అమాయకులు కాదని తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.