ఏపీ బీజేపీ చీఫ్ సుజనా చౌదరి.. కేంద్ర పెద్ద‌ల మ‌ద్ద‌తు ఆయ‌న‌కేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  బీజేపీకి నూత‌న అధ్య‌క్షుడు రాబోతున్నారా?  పార్టీ అధిష్టానం ఆ మేర‌కు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టిందా?  ప్ర‌స్తుతం అధ్య‌క్షురాలిగా ఉన్న పురందేశ్వ‌రికి కేంద్రంలో ప్రాధాన్య‌త క‌ల్పించి.. రాష్ట్రంలో కొత్త‌వారికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేందుకు రంగం సిద్ధ‌మైందా? అంటే అవున‌నే స‌మాధానమే పార్టీ ముఖ్య‌నేత‌ల నుంచి వినిపిస్తోంది. అయితే, బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో నలుగురు ఉండగా వారిలో సుజనా చౌదరికే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా అంటున్నారు.  పార్టీ పెద్దలు కూడా బీజేపీ రాష్ట్ర పగ్గాలు సుజనా చౌదరికే అప్పగించాలన్న భావనతో ఉన్నట్లు చెబుతున్నారు.  సుజనా చౌదరికి పార్టీ రాష్ట్ర పగ్గాలు కట్టబెడితే ఏపీ సర్కార్ తో సమన్వయం చక్కగా ఉంటుందన్నది బీజేపీ అగ్రనాయత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

రాబోయే కాలంలోనూ రాష్ట్రంలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి ముందుకు సాగాల‌న్న ఆలోచ‌న‌లోనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో సుజ‌నా చౌద‌రి అయితేనే కూట‌మి ప్ర‌భుత్వంతో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తూ ఏపీలో బీజేపీ బ‌లోపేతానికి కృషి చేస్తార‌ని కేంద్ర పార్టీ పెద్ద‌లు భావిస్తున్నార‌ని చెబుతున్నారు. అయితే, సుజ‌నా చౌద‌రికి అధ్య‌క్ష బాధ్య‌త‌లుఇచ్చే విష‌యంపై రాష్ట్ర పార్టీలోని కొందరి నుంచి అభ్యంతరం వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది.  ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన వారికే పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని బీజేపీలోని ఓ వ‌ర్గం నేత‌లు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

ద‌క్షిణాది రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ అధిష్ఠానం అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. క‌ర్ణాట‌క‌లో బ‌ల‌మైన పార్టీగా ఉన్న బీజేపీ.. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైంది. మ‌రోవైపు తెలంగాణ రాష్ట్రంలో బ‌ల‌మైన పార్టీగా ఎదుగుతున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే ల‌క్ష్యంగా ఆ పార్టీ నేత‌లు ప‌ని చేస్తున్నారు. ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ‌ కూట‌మి ప్ర‌భుత్వంలో బీజేపీ భాగ‌స్వామిగా ఉంది. రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు మంత్రిగా ఉన్నారు. ఇటీవ‌ల నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ బీజేపీకి ప్రాధాన్య‌త ద‌క్కింది. ప‌లువురు బీజేపీ నేత‌లకు ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వులు ల‌భించాయి. ప్ర‌స్తుత బీజేపీ అధ్య‌క్షురాలు, ఎంపీ పురందేశ్వ‌రి ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌గా ఉంటూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే, ఆమెకు కేంద్ర ప్ర‌భుత్వంలో ప‌ద‌వి ఇచ్చేందుకు బీజేపీ కేంద్ర పెద్ద‌లు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆమె స్థానంలో ఏపీలో బీజేపీకి నూత‌న అధ్య‌క్షుడిని నియ‌మించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఎవ‌రు చేప‌ట్టినా ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌గా ఉంటూనే పార్టీ  బ‌లోపేతంపై దృష్టిసారించాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వానికీ బీజేపీ అధ్య‌క్షుడికి మ‌ధ్య ఏమాత్రం గ్యాప్ వ‌చ్చినా ఎన్డీయే కూట‌మికే ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. గతంలో అంటే 2014 తరువాత ఏపీలో ఇదే పరిస్థితి ఏర్పడి తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయడానికి కారణమైంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ అధ్య‌క్షుడి ఎంపికకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల అభిప్రాయాలను కూడా బీజేపీ హైకమాండ్ పరిగణనలోనికి తీసుకునే అవకాశం ఉంది.  

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లకు కొద్ది నెల‌ల ముందు పురందేశ్వ‌రికి రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన, టీడీపీ క‌లిసి పోటీచేయ‌డానికి ఆమె కీల‌క భూమిక పోషించారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిప్రాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రంలోని పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లి జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మిలో బీజేపీ భాగ‌స్వామిగా మారడంలో పురందేశ్వ‌రి కీ రోల్ పోషించార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌రువాత ఓ సంద‌ర్భంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. పురందేశ్వ‌రి కాకుండా బీజేపీ ఏపీ అధ్య‌క్ష స్థానంలో మ‌రొక‌రు ఉంటే మూడు పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరేది కాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా ప‌వ‌న్‌, చంద్ర‌బాబుతో ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతూ నామినేటెడ్ ప‌దువుల్లో బీజేపీ నేత‌లకు ప్రాధాన్య‌త ద‌క్కేలా ఆమె కృషి చేశారు. ప్ర‌స్తుతం ఆమెను కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద‌వుల్లోకి లేదా కేంద్ర పార్టీ ప‌ద‌వుల్లోకి తీసుకోవాల‌ని పార్టీ పెద్ద‌లు భావిస్తున్నారు. దీంతో పురందేశ్వ‌రి త‌ర‌హాలో ప్ర‌భుత్వంతో మంచి సంబంధాలు కొన‌సాగిస్తూనే.. పార్టీని బ‌లోపేతం చేసే నేత‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో సుజ‌నా చౌద‌రి అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీజేపీ ఏపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డంలో స‌మ‌ర్ధుడ‌న్న భావ‌న‌కు కేంద్ర పార్టీ పెద్ద‌లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీనికితోడు చంద్ర‌బాబు మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోనూ సుజ‌నా చౌద‌రికి మంచి సంబంధాలు ఉన్నాయి. 

విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రితోపాటు ఆధోని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌, సీనియర్‌ నేత రఘురామ్‌ పేర్లు అధ్య‌క్షుడి రేసులో వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీలోని కొంద‌రు నేత‌లు మాత్రం.. ఆర్ఎస్ఎస్ మూలాలు క‌లిగిన‌ నేత‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కేంద్ర పార్టీ పెద్ద‌ల‌పై ఒత్తిడి తెస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో పార్థసారథికి ఆర్ఎస్ఎస్ తో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. మ‌రోవైపు ఆయ‌న రాయలసీమ ప్రాంతం వాసి. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని ఈసారి రాయ‌ల‌సీమ నేతకు అప్ప‌గించాల‌న్న డిమాండ్ కూడా ఉంది. మాధ‌వ్ పేరు కూడా అధ్య‌క్ష రేసులో బ‌లంగా వినిపిస్తుంది. అయితే, సుజ‌నా చౌద‌రివైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. చంద్ర‌బాబు, ప‌వ‌న్ తో ఆయ‌న‌కు మంచి సంబంధాలున్నాయి. మ‌రోవైపు సుజనా చౌద‌రికి కూట‌మి పార్టీల్లోని నేత‌ల‌తోపాటు వైసీపీ లోని నేత‌ల‌తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం వైసీపీ అధికారాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీలోని ముఖ్య‌నేత‌లు కూట‌మి పార్టీల్లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సుజ‌నా చౌద‌రి బీజేపీ అధ్య‌క్ష  స్థానంలో ఉంటే వైసీపీ నుంచి కూట‌మి పార్టీల్లోకి వ‌చ్చేవారిలో ఎక్కువ‌ మంది బీజేపీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశాలు ఉన్నాయి. త‌ద్వారా రాష్ట్రంలో  పార్టీ మ‌రింత బ‌లోపేతం అయ్యే అవ‌కాశం ఉంది. దీంతో కేంద్ర పార్టీ పెద్ద‌లు సుజ‌నా చౌద‌రికే ఏపీ బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు దాదాపు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.