తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా

తెలుగు రాష్ట్రాలను చలి వణికించేస్తున్నది. ఇరు రాష్ట్రాలలోనూ కూడా పలు ప్రాంతాలలో సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలకు తోడు పొగమంచు కమ్మేస్తుండటంతో ఉదయం 9 గంటలకు కూడా విజిబులిటీ తక్కువగా ఉండటంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలోని  సిర్పూర్, గిన్నెదారిలో 6.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.9, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1 కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.  ఇక ఆంధ్రప్రదేశ్ లోని చింతపల్లి, లంబసింగి, పాడేరులలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలకు తోడు చలిగాలులు కూడా వీస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇదే వాతావరణం మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చలి నుంచి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.