సజ్జల కబ్జాల పర్వంపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్
posted on Jan 3, 2025 10:33AM
సజ్జల పాపాల పుట్ట పగులుతోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన పాల్పడిన భూకబ్జాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా ఆయన అటవీ భూములను సైతం వదల లేదు. అటవీ భూములలో ఏకంగా గెస్ట్ హౌస్ లే నిర్మించుకుని జల్సాలు చేసిన వైనం విస్తుగొల్పుతోంది.
సజ్జల భూ బాగోతంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా సర్వం తానై వ్యవహరించిన సంగతి తెలిసిందే. షాడో సీఎంగా సజ్జలే ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడిపారన్న ఆరోపణలకు కూడా ఉన్నాయి.
వాస్తవానికి జగన్ ఐదేళ్ల పాలనా దోపిడీ, దౌర్జన్యాలు, అవినీతి, కబ్జాలకు హద్దన్నదే లేదన్నట్లుగా సాగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు యధేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. అందిన కాడికి భూముల కబ్జాయే లక్ష్యమన్నట్లుగా వారి తీరు సాగింది. ప్రభుత్వ భూములు, అటవీ భూములు, ప్రైవేట్ భూములను ఇష్టారీతిగా ఆక్రమించేసి.. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా చెలరేగిపోయారు. జగన్ పాలన అంతా ప్రభుత్వ, ప్రైవేట్ భూములను దోచుకోవటమే అన్నట్లుగా సాగింది. జగన్ కేబినెట్ లో ఐదేళ్లు మంత్రిగా కొనసాగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడింది. అలాగే విశాఖపట్నంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భూదందా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల భూకబ్జాల పర్వం అడ్డూ అదుపూ లేకుండా సాగింది.
ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబం భూదందా వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. ఆయన భూ కబ్జాల పర్వం ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటకు వస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సజ్జల ఏకంగా అటవీ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జల భూ కబ్జాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా సజ్జల రామకృ ష్ణా రెడ్డి భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. సజ్జల బ్రదర్స్ ఏకంగా 42 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ భూములలో పండ్లతోటలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అంతే కాక అటవీ భూముల్లో గెస్ట్ హౌస్‌లు, పనివారికోసం షెడ్లు కట్టించారు. అయితే, సజ్జల పేరు బయటకు రాకుండా ఆయన అండతో సోదరులు, కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించినట్లు సమాచారం. వారంతా సజ్జల బినామీలేనని ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో సజ్జల సోదరులు కడప శివారు ప్రాంతంలో చేసిన అక్రమాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.