జనతా పరివార్ లో "లైక్స్ అన్ లైక్స్ "
posted on Nov 2, 2015 3:30PM
.jpg)
బిహార్ ఎన్నికలలో నరేంద్ర మోడీ ధాటిని తట్టుకొని నిలబడి ఎన్నికలలో విజయం సాధించాలనే ఆలోచనతోనే బద్ద విరోధులయిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరినొకరు తప్పనిసరిగా ‘లైక్’ చేసుకోవలసి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ పేరుకి జాతీయ పార్టీ అయినప్పటికీ బిహార్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే పరిస్థితిలో లేదు గాబట్టి అది కూడా వారిని ‘లైక్’ చేసి వారితో చేతులు కలిపింది. ఆ మూడు పార్టీలు కలిసి బీహార్ ఎన్నికల వైతరిణిలో నాలుగు రౌండ్లు ఈదేసాయి. ఇంకొక్క రౌండ్ కష్టపడి ఈదేస్తే ఒడ్డున పడొచ్చు...లేదా లాలూ ప్రసాద్ యాదవ్ ‘ట్రాక్ బరువును’ మోయలేక అందరూ కలిసి ఆయనతో బాటే మునిగిపోవచ్చును. ఒకవేళ జనతా పరివార్ ఎన్నికలలో ఓడిపోతే ఆ క్రెడిట్ అంతా పూర్తిగా లాలూ ప్రసాద్ యాదవ్ కే దక్కుతుంది తప్ప నరేంద్ర మోడీకొ లేక అమిత్ షాకో దక్కదు.
ఈ కాంపిటీషన్ లో చేతులు పట్టుకొని కలిసికట్టుగా ఈదుతున్న వాళ్ళ ముగ్గుర్నీ చప్పట్లు కొడుతూ ఎంకరెంజ్ చేస్తున్నారు డిల్లీ ఆమాద్మీ అరవింద్ కేజ్రీవాల్. ఆయన నితీష్ కుమార్ పరిపాలనను చూసి ఓటేయమని బిహార్ ప్రజలకు సజెస్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా సేమ్ డిటో డిటో. మళ్ళీ వాళ్లిద్దరూ ఒకరినొకరు ‘లైక్’ చేయరు. రాహుల్ జీ నితీష్ కుమార్ ని ‘లైక్’ చేస్తారు. కానీ లలూని ‘అన్ లైక్’ చేస్తారు. కానీ నితీష్ రాహుల్ జీతో కలిసి ప్రచారం చేయడాన్ని ‘లైక్’ చేయరు. అయినా రాహుల్ జీ నితీష్ మొహం చూసే ఓట్లేయమని జనానికి సజెస్ట్ చేస్తుంటారు.
అలాగే లాలూ కూడా రాహుల్ జీని ‘లైక్’ చేయరు. ఎందుకంటే లాలూ ప్రసాద్ పై అనర్హత వేటు పడటానికి కారకుడు రాహుల్ జీ యే! ఆనాడు డా.మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల చట్ట సవరణలపై ఆమోదించిన ఆర్డినెన్స్ “నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు..దానిని చింపి చెత్త బుట్టలో పడేయాల్సిందే”నని అనడంతో బిత్తరపోయిన డా.మన్మోహన్ సింగ్ నిజంగానే దానిని చింపి చెత్త బుట్టలో పడేశారు. అదే ఆర్డినెన్స్ అమలులో ఉండి ఉంటే నేడు లాలూ ప్రసాద్ యాదవ్ పై అనర్హత వేటుపడేదే కాదు...అప్పుడు ఆయన కూడా ఈ ఎన్నికలలో పోటీ చేసి ఉండేవారు. ఆ అవకాశమే ఆయనకు ఉండి ఉంటే బహుశః నితీష్ కుమార్ ఆయనని ‘లైక్’ చేసేవారే కాదేమో?
కారణాలు ఎవయినప్పటికీ అందరూ తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరినొకరు ‘లైక్’ ‘అన్ లైక్’ చేసుకొంటూనే ఎన్నికల వైతరిణిని ఈదేస్తున్నారు. మరి ఇంత ఇస్ట్రాంగ్ కమ్యూని కేషన్ గ్యాప్ ఉన్నవీరందరూ గెలిస్తే పాపం బిహార్ ప్రజలు ఏమవుతారో ఏమో?అనే ధర్మ సందేహం కలుగుతోంది.