తిరుపతి టీడీపీ గుండెల్లో టీటీడీ రాయి
posted on Feb 7, 2015 4:41PM

ఈనెల 13వ తేదీ తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. తిరుపతి ఎమ్మెల్యేగా వున్న వెంకట రమణ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుపుతున్నారు. దివంగత ఎమ్మెల్యే భార్య సుగుణమ్మ ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వున్నారు. ఈ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని టీడీపీ ప్రయత్నించడంతో కాంగ్రెస్, లోక్‌సత్తా, కొంతమంది ఇండిపెండెంట్లు పట్టిన పట్టు విడవకపోవడం వల్ల పోలింగ్ జరపడం అనివార్యమైంది. అయినప్పటికీ ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ గెలుపు ఖాయమన్న ధీమాలో మొన్నటి వరకూ స్థానిక టీడీపీ వర్గాలు వున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన పరిణామాలు ఆ వర్గాల గుండెల్లో రాళ్ళు పడేలా చేశాయి.
తిరుపతిలో ఒక మఠానికి చెందిన స్థలంలో అనేకమంది ఎప్పటి నుంచో ఇళ్ళను నిర్మించుకుని వున్నారు. ఆ స్థలం దశాబ్దాల క్రితం టీటీడీకి స్వాధీనం అయింది. ఆ స్థలంలో నిర్మించిన ఇళ్ళను తొలగించాలని టీటీడీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అయితే రాజకీయ వత్తిడుల కారణంగా అది సాధ్యపడలేదు. అయితే ఆ స్థలంలో ఎప్పటి నుంచో ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు కాబట్టి చూసీ చూడనట్టు వదిలేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు కూడా వున్నాయి. గత పది సంవత్సరాలుగా రెండు మూడుసార్లు ఆ ఇళ్ళను తొలగించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ, వీలు కాలేదు. ఇది ఎప్పటి నుంచో తెగని పంచాయితీలా వుంది. గత ప్రభుత్వాలు కూడా ఈ ఇళ్ళ జోలికి వెళ్ళకపోతేనే మంచిదని భావించాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఈ తేనెతుట్టెని మళ్ళీ కదిల్చారు. ఈ ఇళ్ళను ఖాళీ చేసి వెళ్ళిపోవాలని, ఇంతకాలం తమ స్థలంలో ఇళ్ళు నిర్మించుకుని నివసించారు కాబట్టి తమకు అద్దె చెల్లించాలని టీటీడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. దాంతో స్థానిక తెలుగుదేశం వర్గాలు గతుక్కుమన్నాయి.
దశాబ్దాలుగా ఏ పార్టీ అయినా టచ్ చేయడానికి జంకిన అంశాన్ని ఇప్పుడు టచ్ చేయడం, అది కూడా తిరుపతి ఎన్నికలు జరగబోతున్న సమయంలో నోటీసులు జారీ చేయడం ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల్లో నెట్టే అంశమని స్థానిక టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నోటీసుల కారణంగా 15 వేల ఓట్లు ఖాయంగా గల్లంతైనట్టేనని, ఇలా కూల్చివేతల కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న అభిప్రాయం తిరుపతి నియోజకవర్గ ప్రజల్లో బలంగా కలిగితే దానివల్ల ఎంత నష్టం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఈ నోటీసులు జారీ చేసేముందు చంద్రబాబు నాయుడు స్థానిక తెలుగుదేశం నాయకులనుగానీ, కార్యకర్తలను గానీ ఎంతమాత్రం సంప్రదించకుండా అధికారుల మాటల్ని నమ్మడం బాగాలేదని అనుకుంటున్నారు. కనీసం ఆ నోటీసులేవో జారీ చేసేముందు తమను ఒక్క మాట అడిగినా దానివల్ల వచ్చే సమస్యలేమిటో వివరించేవాళ్ళమని, ఇప్పుడు తీరా నోటీసులు జారీ చేశాక తాము ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేశామని చెబుతున్నారు.
అధికారంలో లేనప్పుడు కార్యకర్తల నాయకుడిగా వుండటం, అధికారం వచ్చిన తర్వాత అధికారులు చెప్పినట్టు వినే ముఖ్యమంత్రిగా మారిపోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల విషయంలో చంద్రబాబు తీరు ఓడ మల్లన్న... బోడిమల్లన్న తరహాలో వుండటం పట్ల వారు బాధపడుతున్నారు.అధికారుల మాటలు నమ్మి తిరుపతిలో జారీ చేసిన నోటీసుల వల్ల తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే ఆ బాధ తమకే వుంటుంది తప్ప అధికారులకు కాదని వారు అంటున్నారు. ఏది ఏమైనా అధికారుల అత్యుత్సాహం కారణంగా తిరుపతిలో తలెత్తిన పరిస్థితులు పార్టీకి ఇబ్బంది కలిగించకూడదనే వారు కోరుకుంటున్నారు.