అన్ని హామీలు అమలు చేస్తాం: జైట్లీ

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి తన డిల్లీ పర్యటనలో కేంద్రంతో కొంచెం కటువుగానే మాట్లాడారు. నిన్న డిల్లీలో జరిగిన ‘నీతి ఆయోగ్’ సమావేశానికి హాజరయిన ఆయన, ప్రధాని మోడీని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి సహాయం చేయడంలో జరుగుతున్న జాప్యం పట్ల రాష్ట్ర ప్రజలలో నానాటికి పెరుగుతున్న అసంతృప్తి గురించి వారికి వివరించి తక్షణమే రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. ప్రజాభీష్టానికి విరుద్దంగా గత యూపీయే ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసినప్పుడు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకొంటామని పార్లమెంటులో, విభజన చట్టంలో కూడా పేర్కొన్నాయని, గానీ ఇప్పుడు ఆర్దిక సమస్యలున్నాయని చెపుతూ జాప్యం చేయడం ఎవరికీ మంచిది కాదని ఆయన తెలిపారు. ఈ అంశంపై ప్రజలు, మీడియా, రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందిస్తున్నదీ కూడా ఆయన వారికి వివరించారు.

 

ఆయన ఒత్తిడి కారణంగానే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను, విభజన చట్టంలో పెర్కొన్నవీ అన్నిటినీ తమ ప్రభుత్వం తప్పకుండా అమలుచేస్తుందని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలే అయ్యిందని, కనుక ఒక్కొక్కటిగా రాష్ట్రానికిచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని ఆయన తెలిపారు. ఇటీవల రాష్ట్రానికి మంజూరు చేసిన ఆర్ధిక ప్యాకేజీ కేవలం ఆరంభం మాత్రమేనని మున్ముందు ఇంకా విడుదల చేస్తామని, ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగానే మరికొంత విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రత్యేకహోదా విషయంలో కూడా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని స్పష్టం చేసారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తేవడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ, ప్రజలను ఆకట్టుకొని రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్న కారణంగా ఆయన నేరుగా ఆర్ధికమంత్రి చేతనే ఈవిధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింపజేయడం వలన తన ప్రయత్నలోపం ఏమి లేదనే సంగతి స్పష్టం చేయగలిగారు. ఆ విషయం ప్రజలకి కూడా తెలుసు గానీ, రాష్ట్రానికి నిధులు మంజూరులో ఎక్కడ, ఎందుకు జాప్యం జరుగుతోందనే విషయాన్ని ఆయన ఆర్ధిక మంత్రి జైట్లీ ద్వారానే చెప్పించడం ద్వారా ఈ అంశంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఆయన జవాబు చెప్పినట్లయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu