చంద్రబాబు రేపు డిల్లీకి పయనం

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు మళ్ళీ డిల్లీ ప్రయాణం అవుతున్నారు. కారణం పాతదే. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి, ప్రధాని నరేంద్ర మోడీకి విన్న వించుకోవడానికి వెళుతున్నారు. మూడు రోజుల క్రితం కేంద్రం ప్రకటించిన రూ.850 కోట్ల ఆర్ధిక ప్యాకేజీ పట్ల ప్రతిపక్షాలే కాదు, అధికార పార్టీకి చెందిన మంత్రులు కూడా పెదవి విరుస్తున్నారు. బడ్జెట్ లోటు రూ.16, 000 కోట్లు ఉంటే, కేంద్రం కేవలం రూ.500 మాత్రమే విడుదల చేసింది. తెదేపా-బీజేపీ మిత్ర పక్షాలయినప్పటికీ తెదేపా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టడంలో విఫలమయిందని విమర్శలు గుప్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమయిన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీకి కూడా ఇటువంటి వ్యతిరేక ప్రచారం ఎంత మాత్రం మంచిది కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలే తమ అధిష్టానికి చెప్పుకొంటారు కనుక చంద్రబాబు నాయుడు ఆ ప్రసక్తి తేకపోవచ్చును. కానీ రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర ఆర్ధిక లోటుని ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకొంటామని నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినందున, అదే విషయం ఆయనకు మరో మారు గుర్తుచేసి బడ్జెట్ లోటును పూడ్చుకోనేందుకు కేంద్ర సహాయం కోరవచ్చును. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా అందుకు సరిసమానంగా రాయితీలు, నిధులు విడుదల చేయమని అభ్యర్ధించవచ్చును. అదేవిధంగా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, తిరుపతి, విజయవాడ మరియు వైజాగ్ నగరాలలో మెట్రో రైల్ ప్రాజెక్టులు, వివిధ ఉన్నత విద్యాసంస్థల స్థాపనకు అవసరమయిన అనుమతులు, నిధులు కోరవచ్చును. మార్చి నెలాఖరుతో ముగిసే ఈ ఆర్ధిక సం.లో కేంద్రం నుండి వీలయినంత ఎక్కువ నిధులు రాబట్టుకోలేకపోయినట్లయితే, ఆ ప్రభావం వచ్చే ఆర్ధిక సం.కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ పై కూడా ఉంటుంది. కనుక ఈసారి చంద్రబాబు నాయుడు కేంద్రంపై మరింత ఒత్తిడి చేయవచ్చును. మరి కేంద్రం ఆయన ఒత్తిడికి లొంగి నిధులు విడుదల చేస్తుందో లేదో త్వరలోనే తెలిసిపోతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu