తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు?

తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పీక్స్ కు చేరాయి.  హిందుత్వ భావజానం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజప రిణామంగా అంతా భావించేవారు.

వామపక్ష పార్టీలు, బీజేపీలు కన్జర్వేటివ్ పొలిటికల్ పార్టీలకు భిన్నంగా సైద్ధాంతిక నిబద్ధతతో ఉంటాయని భావించేవారు. అయితే బీజేపీలో ఇప్పుడా పరిస్థితి లేదు. మిగిలిన రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలకు పెద్ద తేడా లేకుండా పోయింది. ప్రధానంగా  బీజేపీ నాయకత్వం మోడీ  చేతులలోకి వచ్చిన తరువాత పార్టీకి మిగతా పార్టీలకీ ఉండే తేడా మాయమైపోయింది. సిద్ధాంతం కంటే ఓట్లు, సీట్ల లెక్కలకే బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యం ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా బీజేపీకీ ఇతర పార్టీలకీ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కూ తేడా లేని పరిస్థితి ఏర్పడింది. నాలుగు ఓట్లు, ఓ రెండు సీట్లు వస్తాయనుకుంటే.. బీజేపీ మౌలిక సిద్ధాంతాలతో విభేదించే వారిని కూడా కాషాయ కండువా కప్పి, రెడ్ కార్పెట్ పరిచి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో తొలి నుంచీ బీజేపీ సిద్ధాంతాలను నమ్మి ఆ పార్టీలో కొనసాగుతున్న వారికీ, మధ్యలో రాజకీయ కారణాలతో వచ్చి చేరిన వారికీ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితి  దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో  ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

2024 సార్వత్రిక ఎన్నికల తరువాత తెలంగాణ బీజేపీలో పాత వారు కొత్తవారు అన్న విభజన మరింత స్పష్టంగా గోచరిస్తోంది. ఇక ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక దగ్గరకొచ్చేసరికి తొలి నుంచీ బీజేపీలో కొనసాగుతున్నవారు, మధ్యలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారి మధ్య విభేదాలు రచ్చకెక్కి ఘర్షణలకు, వాగ్యుద్ధాలకూ దారి తీసే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి విషయంలో  మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్,  గోషామహల్ ఎంపీ రాజాసింగ్ ల మధ్య మాటల యుద్ధమే జరిగింది. అంతే కాకుండా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ముందన్న వారంతా బయట నుంచి వచ్చి పార్టీలో చేరిన వారే ఉండటంతో తొలి నుంచీ పార్టీలో ఉన్న వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో పాటు బాహాటంగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడటంతో బీజేపీ హైకమాండ్ అధ్యక్షుడి నియామకాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. దీనిని బట్టే పార్టీలో వర్గ విభేదాలు ఏ స్థాయికి చేరాయో అర్థమౌతుంది. 

ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో పార్టీ ఆయనను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించింది. తదుపరి అధ్యక్షుడిగా ఎవరు అన్నదానిపై రాష్ట్ర నేతల అభిప్రాయాలను సేకరించడానికి ఉపక్రమించింది. ఈ తరుణంలోనే పార్టీలో ఒక్క సారిగా విభేదాలు భగ్గుమన్నాయి. తొలి నుంచి పార్టీలో ఉన్నవారు, ఆ తరువాత వచ్చిన వారూ రెండు గ్రూపులుగా చీలిపోయారు. దీంతో పార్టీలో నిట్టనిలువుగా చీలిక వచ్చే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందనరావు,  ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ రామచంద్రరావు వంటి వారు ముందు వరుసలో ఉన్నారు. వీరంతా ఎవరికి వారు తమతమ లాబీయింగ్ ప్రారంభించినట్లు చెబుతున్నారు.  ఈ పరిస్థితి రాష్ట్రంలో బీజేపీని బలహీనపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్యాడర్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది.