మీడియాకి ధైర్యం వచ్చింది
posted on Jul 1, 2015 11:35PM
తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకూ మీడియా పిరికిదైపోయింది. అధికారంలో వున్న టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా ఏ వార్త రాయాలన్నా, ఏ కథనాన్ని ప్రసారం చేయాలన్నా మీడియా భయపడిపోయేది. ఎందుకంటే టీవీ9, ఏబీఎస్ ఛానెళ్ళ మీద లోపాయికారీగా విధించిన నిషేధం మీడియా మీద బాగా ప్రభావాన్ని చూపించింది. మీడియా మొత్తం హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన నేపథ్యంలో, మీడియా మొత్తం ఆంధ్రపదేశ్‌తోపాటు తెలంగాణలో కూడా విస్తరించిన నేపథ్యంలో, మీడియాకి కూడా అర్థిక అవసరాలు వుంటాయి కాబట్టి మీడియా కేసీఆర్‌కి వ్యతిరేకంగా కథనాలు ఇవ్వడానికి భయపడేది. పొరపాటునో, గ్రహపాటునో ఏదైనా కథనం రాస్తే తమకు కూడా టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ళకు పట్టిన గతే పడుతుందేమోనని మీడియా భయపడింది. టీవీ9 టీఆర్ఎస్‌తో రాజీకి వచ్చి తనమీద వున్న నిషేధాన్ని తొలగించుకున్నప్పటికీ, ఏబీఎన్ మాత్రం ఇప్పటికీ నిషేధ కోరల్లో వుంది. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని మీడియా చాలా బేలన్సింగ్‌గా వ్యవహరిస్తూ వస్తోంది. ఆర్థిక పునాదుల మీద దెబ్బకొట్టే టీఆర్ఎస్‌తో పెట్టుకోవడం ఎందుకని సర్దుకుపోతూ వస్తోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమ మీద ‘ఆంధ్రా మీడియా’ అనే ముద్ర వేసి అణిచేస్తే, మళ్ళీ పైకి లేవగలమో లేదోనన్న భయంతో బతుకుతూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేసినా, కేసీఆర్ ఎంత పచ్చిగా ఆంధ్రావాళ్ళను తిట్టినా వాటిని విమర్శించకుండా నెట్టుకొస్తోంది. ఏనుగును కొంతకాలం గొలుసుతో కట్టేయడం అలవాటు చేసి, ఆ తర్వాత కాలికి గొలుసు వుంచి బంధించకపోయినా ఆ ఏనుగు తాను బందీగానే వున్నాననుకుని అక్కడి నుంచి కదలడట. మొన్నటి వరకూ తెలుగు మీడియా పరిస్థితి అలాగే వుండేది. అయితే ఓటుకు నోటు వ్యవహారం, ట్యాపింగ్ వ్యవహారం తర్వాత తెలుగు మీడియా ఎందుకో భయాన్ని వదిలేసింది. ఇప్పుడు అనేక ఛానళ్ళలో, వార్తా పత్రికలలో కేసీఆర్‌కి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కథనాలు వస్తున్నాయి. టీఆర్ఎస్, వైసీపీ ఆశీస్సులతో నడిచే మీడియాలో మినహా మిగతా మీడియా అంతటా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేక కథనాలు వస్తూనే వున్నాయి. మీడియాకి వచ్చిన ఈ ధైర్యం కలకాలం కొనసాగాలి.