ఎర్రచందనం వేలంవెర్రి ఎందుకో...
posted on Jan 28, 2015 2:19PM

ఎర్రచందనం... చాలా ఖరీదైన కలప. అందమైన వస్తువుల తయారీకి, వైద్యానికి ఉపయోగపడే ఈ కలప శ్రీ చందనం తర్వాత ఆ స్థాయి విలువ కలిగిన కలప. ఎగుమతులకు ఎంతో అవకాశం వున్న దీనికోసం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణిచేస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పతరువులా మారాయి.
ఎర్రచందనం విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా వుంటే, తెలంగాణలో మరోరకంగా వుంది. ఈమధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ హరిత హారం’ పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రమంతటా మొక్కలు నాటి, వాటిని వృక్షాలుగా పెంచి తెలంగాణ మొత్తాన్ని ఆకుపచ్చగా చేయాలన్నది ఈ పథక ఉద్దేశం. దీనితోపాటు భవిష్యత్తులో ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేలా చేసుకోవాలని ప్రభుత్వాధినేతలు ఆలోచించారు. దాంతో ఆ మొక్కలూ ఈ మొక్కలూ ఎందుకు... ఏకంగా ఎర్రచందనం మొక్కలు నాటేయండి.. భవిష్యత్తులో అవి చెట్లయిన తర్వాత వేలం వేస్తే బోలెడంత ఆదాయం అని ఆదేశాలు ఇచ్చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 75 లక్షల ఎర్రచందనం మొక్కల్ని నర్సరీలలో పెంచారు. ఇక వీటిని రాష్ట్రమంతటా నాటడమే ఆలస్యం. ప్రభుత్వ పెద్దల ఆలోచనలు ఇలా వుంటే, ఇలాంటి విషయాలలో అనుభవం వున్న అధికారులు మాత్రం తెలంగాణలో ఎర్రచందనం మొక్కల్ని నాటడం వృధా అని అంటున్నారు. ఎర్రచందనం చెట్లు చక్కగా పెరిగి, నాణ్యమైన ఎర్రచందనం కలప ఇవ్వడానికి రాయలసీమ వాతావరణం మాత్రమే అన్నివిధాలా అనుకూలంగా వుంటుందని చెబుతున్నారు. తెలంగాణ వాతావరణం, భౌగోళిక పరిస్థితులను బట్టి ఎర్రచందనం మొక్కలు ఇక్కడ పెరగవని, ఒకవేళ వాటిని తంటాలు పడి పెంచినా చాలా నాసిరకం కలప వస్తుందని అంటున్నారు. అంచేత, ప్రభుత్వం తెలంగాణ అంతటా ఎర్రచందనం మొక్కలు కాకుండా టేకుగానీ, యూకలిప్టస్ మొక్కలు గానీ నాటుకుంటే మంచిదని అంటున్నారు.