మరో జేఏసీ ఏర్పాటుకి రంగం సిద్ధం
posted on May 2, 2015 2:41PM
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో పొలిటికల్ జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) నిర్వహించిన పాత్ర ఏమిటో అందరికీ తెలిసిందే. ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో పనిచేసిన ఈ కమిటీ టీఆర్ఎస్ మినహా మిగతా రాజకీయ పార్టీలను ఉతికి ఆరేసింది. రాజకీయ పార్టీల ఐక్యవేదిక పేరుతో స్థాపించిన ఈ వేదిక రాజకీయ పార్టీలనే ఒక ఆట ఆడించింది. అబ్బే అలాంటిదేమీ లేదు అని ఆ వేదికకు నాయకత్వం వహించినవారు చెబుతూ వచ్చినప్పటికీ, కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌కి ఈ వేదిక కొమ్ముకాస్తూ వచ్చింది. టీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ కోసం కృషి చేస్తున్నట్టు, మిగతా పార్టీలన్నీ గోడమీద పిల్లుల్లా వ్యవహరిస్తున్నట్టు పొలిటికల్ జేఏసీ ప్రజల ముందు బాగా ప్రొజెక్ట్ చేయగలిగింది. అందుకే అన్ని పార్టీలూ తెలంగాణ కోసం పోరాడినప్పటికీ ఆ క్రెడిట్ మాత్రం టీఆర్ఎస్‌కి మాత్రమే దక్కింది. తనకు రాజకీయంగా అంత సహకరించిన పొలిటికల్ జేఏసీ రుణం కూడా టీఆర్ఎస్ బాగానే తీర్చుకుంది. కన్వీనర్ కోదండరామ్‌కి మినహా చాలామందికి బాగానే ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన అనంతరం పొలిటికల్ జేఏసీ నిర్వీర్యం అయిపోయిందని, అధికార టీఆర్ఎస్ జేబు సంస్థ అయిపోయిందని తెలంగాణలోని కొన్ని ఉద్యమ శక్తులు ఆరోపిస్తున్నాయి. దేన్ని ఆశించి తెలంగాణ ఉద్యమం చేశామో, అది తెలంగాణ ఏర్పడినప్పటికీ నెరవేరలేదని ఆ ఉద్యమ శక్తులు భావిస్తున్నాయి. అందుకే, ఇప్పుడు నిర్వీర్యంగా మారిపోయిన జేఏసీని పక్కన పెట్టి, కొత్తగా ఒక ‘తెలంగాణ ఉద్యమకారుల వేదిక’ను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పొలిటికల్ జేఏసీలో క్రియాశీలకంగా పనిచేసి, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాధాన్యం లభించని శక్తులు, కవులు, కళాకారులు, రాజకీయ శక్తులూ అన్నీ ఒక తాటి మీద నిలిచి ఈ తెలంగాణ ఉద్యమకారుల వేదికను ముందుకు నడిపించాలని భావిస్తు్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సాధించిన తెలంగాణ తాము కోరుకున్న తెలంగాణ కాదని, తాము కోరుకున్న నిజమైన తెలంగాణ సాధించే దిశగా ఈ వేదిక పనిచేయనుందని తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలో వున్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపే విధంగా, సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే విధంగా ఈ వేదిక పనిచేస్తుందట. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం నుంచి ప్రాధాన్యం లభించని ఉద్యమ శక్తులను ఒక్క తాటి మీదకు తెచ్చే పని వేగంగా జరుగుతోంది. త్వరలో ఈ వేదికకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.