పోలవరం పనుల్లో కొత్త ట్విస్టు



పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న పీపీఎ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని ఆ బాధ్యతలను ఇప్పటి నుంచి తాము సూచిస్తున్న మరో సంస్థ నిర్వహిస్తుందని  కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ జల వనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇకమీద పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నిటినీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే యాక్సిలర్డ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (ఏఐబీపీ) నిర్వహిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఏఐబీపీని పదేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దేశంలోని అనేక ప్రాజెక్టుల పనులు ఈ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఏఐబీపీ ఆధ్వర్యంలోకి పోలవరం ప్రాజెక్టు వెళ్ళిందంటే, ఇప్పటి వరకూ ఆ సంస్థ పనిచేసిన తీరులోనే పోలవరం ప్రాజెక్టు పనులు కూడా జరుగతాయని భావించవచ్చు. ఏఐబీపీ నిబంధనల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులు జరగాలంటే, ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చులను మొత్తం మొదట రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఆ తర్వాత ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ముక్కు ఎక్కడుందీ అంటే చేతిని తలచుట్టూ తిప్పి చూపించినట్టుగా వ్యవహారం వుంటుందన్నమాట.

కేంద్ర జలవనరుల శాఖ జారీ చేసిన సర్క్యులర్ ఏపీ వర్గాలను అయోమయంలో పడేసింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏఐబీపీ రంగంలోకి దిగిందంటే, ఇప్పటి వరకూ అమల్లో వున్న పోలవరం ప్రాజెక్టు అధారిటీ పరిస్థితి ఏమిటో ఆ సర్క్యులర్‌లో స్పష్టంగా చెప్పలేదని ప్రభుత్వం వర్గాలు అంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసిన 249 కోట్లు పీపీఏ బ్యాంకు అకౌంట్లోనే వున్నాయి. మరి ఆ నిధులను ఎలా మళ్ళించాలి, ఎలా ఖర్చు చేయాలనే స్పష్టత లేదు. అలాగే ప్రాజెక్టును నిర్మించాలంటే మొదట రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఖర్చుచేయాలి. ఆ తర్వాత కేంద్రం వాటిని తిరిగి ఇస్తుంది. ప్రాజెక్టు పనులను పర్యవేక్షించే ఏఐబీపీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేయదు. కేంద్రం ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. ఇలాంటి అనేక గందరగోళాలను కేంద్రం కొత్తగా జారీ చేసిన సర్క్యులర్ సృష్టించింది. వీటన్నిటి విషయంలో కేంద్రం మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు.