తెలంగాణ భూములు ఫర్ సేల్
posted on May 2, 2015 3:40PM
తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో వున్న ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్వ సన్నాహాలూ జరుగుతున్నాయి. మిగతా ఎనిమిది జిల్లాల విషయంలో పెద్దగా శ్రద్ధ వున్నా లేకపోయినా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని భూములను అమ్మే విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మిగతా జిల్లాల్లో ఎకరాల్లో భూములు అమ్మినా రాని డబ్బు ఈ రెండు జిల్లాల్లో గజాల్లో అమ్మినా వస్తుంది మరి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలుకు డబ్బు చాలా అవసరమై కూర్చుంది. వీటి అమలు కోసం ఇప్పటికే కొన్ని ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి టీ సర్కార్ అప్పులు చేసింది. అయితే ఆ డబ్బు కూడా చాలకపోవడంతో భూములు అమ్మి గట్టెక్కడమే తరుణోపాయమని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి చకచకా పావులు కదుపుతోంది.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్‌లో భూములను అమ్మడం ద్వారా 6500 కోట్లను ఆదాయంగా పొందాలని ప్రతిపాదించారు. అయితే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమాల్ అనడంతో గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో గత ఏడాది భూములు అమ్మడానికి వీలు లేకుండా పోయింది. అయితే ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా భూములను అమ్మడం ద్వారా 13,500 కోట్ల రూపాయలను పొందాలని ప్రతిపాదించారు. గత సంవత్సరం ఎలాగూ భూములను అమ్మలేదు కాబట్టి, ఆ ఏడాదిది, ఈ ఏడాదిది కలిపి ఒకేసారి అమ్మేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. భూములు అమ్మకపోతే పథకాలు, కార్యక్రమాలు ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేకపోవడంతో ఇక భూముల అమ్మకం తప్పనిసరి అయింది.
తెలంగాణలోని పది జిల్లాల్లో వున్న ప్రభుత్వ భూముల వివరాలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఇప్పుడు సిద్ధంగా వున్నాయి. వీటిలో న్యాయపరమైన చిక్కులు వున్న భూములను పక్కన పెట్టి, ఎలాంటి సమస్యల లేని భూముల్ని అర్జెంటుగా అమ్మేసే ఆలోచనలో ప్రభుత్వం వుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు వందల గజాల వైశాల్యం వున్న భూముల దగ్గర నుంచి ఎకరాల వరకు అమ్మకానికి ప్రభుత్వం సిద్ధంగా వుంది. గతంలో వైఎస్సార్ హయాంలో ప్రభుత్వం భూముల్ని ఎలా హాట్ కేకుల్లా అమ్మిందే అదే తరహాలో అమ్మి క్యాష్ చేసుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. మరి ప్రభుత్వం ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి.