ముచ్చటగా మూడు తీర్పులు



ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు శుక్రవారం నాడు ఇచ్చిన మూడు తీర్పులు నిజంగా ముచ్చటైన తీర్పులు... ఆయా అంశాలలో ఇప్పటి వరకు నెలకొన్ని గందరగోళ పరిస్థితికి ఫుల్‌స్టాప్ పెట్టే తీర్పులు.  వీటిలో ఒకటి హైకోర్టును ఏపీ, తెలంగాణలకు విభజించాలనే వివాదానికి సంబంధించిన తీర్పు. హైకోర్టును అర్జెంటుగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వ వర్గాలతోపాటు తెలంగాణ లాయర్లు కూడా చాలాకాలంగా భావిస్తున్నారు. ప్రభుత్వం ఏపీ హైకోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి తనవంతు సహకారం అందిస్తానని చెబుతూ వస్తోంది. ప్రభుత్వ సానుభూతిపరులైన కొందరయితే హైకోర్టు విభజన జరగకుండా ఏపీ ప్రభుత్వం, వెంకయ్య నాయుడు అడ్డుపడుతున్నారని అనధికారికంగా కామెంట్లు చేస్తూ వచ్చారు. తెలంగాణ లాయర్ల విషయం అయితే బోలెడంత చెప్పుకోవచ్చు. తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఆంధ్రప్రాంతానికి చెందిన న్యాయమూర్తిని కూడా అడ్డుకునే సాహసం చేశారు. ఇలాంటి ధోరణులు ఇంకా ముదరకముందే హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఏపీలో హైకోర్టు ఏర్పడే వరకూ ఇప్పుడున్న హైకోర్టు విభజన జరగదని స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో అయినా ఈ అంశంలో ఆందోళనలు ఇకనైనా ఆగుతాయని ఆశించడం అత్యాశ కాకూడదు.

అలాగే హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ కార్యదర్శుల విషయంలో కూడా తీర్పు వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీటీడీపీ ఎమ్మెల్యే దాఖలు చేసిన కేసులో ఈతీర్పు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పార్లమెంటరీ కార్యదర్శులుగా డి.వినయభాస్కర్, జి.కిషోర్ కుమార్, జలగం వెంకట్రావు, వి.శ్రీనివాస్ గౌడ్, జి.కిషోర్ కుమార్, కోవా లక్ష్మిలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. చట్ట విరుద్ధంగా ఈ నియామకాలు జరిగాయని పేర్కొంటూ, ఇలాంటి నియామకాలను ఇకపై జరపరాదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నియామకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం తమ పరిధిని దాటిందన్న విషయం స్పష్టమైంది.

ఇక మూడో తీర్పు తెలంగాణ భూ భాగంలో వున్న ఉన్నత విద్యామండలి మీద అధికారాలు తెలంగాణ ప్రభుత్వానికే ఉన్నాయని తెలిపే తీర్పు.  బ్యాంకు ఖాతా నిర్వహణ అధికారం కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందని, ఈ విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించి సముచితమైన నిర్ణయం తీసుకోవాలనే తీర్పు. మొత్తమ్మీద హైకోర్టు ఒకేరోజున మూడు కీలకమైన తీర్పులు ఇవ్వడం ద్వారా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీల్లేదని, కోర్టులు, చట్టాలకు లోబడే పనిచేయాల్సి వుంటుందనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటికైనా ఈ మూడు అంశాలలో ప్రభుత్వాలు వివాద రహితంగా వ్యవహరిస్తే బావుంటుంది.