కేటీఆర్... సభా హక్కుల నోటీసు...
posted on Nov 12, 2014 11:13AM
![](/teluguoneUserFiles/Assembly9.jpg)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యల మీద స్పీకర్‌కి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పారు. తమను ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ ఎమ్మెల్యేలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ మీద సభాపతి చర్యలు తీసుకోకపోతే సభాపతి మీద అవిశ్వాస తీర్మానం పెడతామని ఆయన హెచ్చరించారు. తండ్రి కేసీఆర్ మాదిరిగానే కేటీఆర్ కూడా నిరంతరం అబద్ధాలు చెబుతున్నారని, సభ సజావుగా సాగనివ్వకుండా టీఆర్ఎస్ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హెరిటేజ్ సంస్థ పాలను కేరళ రాష్ట్రం నిషేధించిందని టీఆర్ఎస్ సభ్యుడు రవీందర్‌రెడ్డి అనడం ఆయన అవగాహనా లేమికి అద్దం పడుతోందని, కేరళ ప్రభుత్వం హెరిటేజ్ పాల మీద విధించిన నిషేధాన్ని తన తప్పు తెలుసుకుని తొలగించిన విషయం టీఆర్ఎస్ సభ్యులకు తెలియక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి వివరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 10 కోట్ల ముడుపులు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పుడు టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన రవీందర్ రెడ్డి ఆ తర్వాత తన ముడుపులలో హరీష్ రావుతోపాటు కేటీఆర్‌కి కూడా వాటా ఇచ్చి తన మీద సస్పెన్షన్‌ని ఎత్తివేయించుకున్నారని ఆయన చెప్పారు. అలాంటి రవీందర్రెడ్డి కూడా ఇప్పుడు హెరిటేజ్ సంస్థ గురించి మాట్లాడ్డం విచిత్రంగా వుందని రేవంత్ రెడ్డి అన్నారు.