హీరోలని బతిమాలాలి.. ఖర్మ..

 

ఎప్పుడూ సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వుండే టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా ఆమధ్య తెలుగు హీరోలు మగాళ్ళు కాదు.. వాళ్ళకి దమ్ము లేదంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్ జరిగితే ఎగేసుకుంటూ వెళ్ళే తెలుగు హీరోలు, హీరోయిన్లు ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల కార్యక్రమానికి మాత్రం రావడం లేదని అన్నారు. అలాగే ఇటీవల జరిగిన ‘మేముసైతం’ కార్యక్రమం మీద కూడా భరద్వాజ కామెంట్లు చేశారు. గతంలో చిత్తూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే ప్రోగ్రామ్ చేస్తూ కోటి రూపాయలు వచ్చాయని, ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ అంతా కలసి ‘మేముసైతం’ కార్యక్రమం నిర్వహిస్తే ఎనిమిది కోట్లు కూడా రాలేదని అన్నారు. ఇలాంటి సమాజా సేవా కార్యక్రమాలకు హీరోలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. కానీ హీరోలను బతిమాలుకోవాల్సిన పరిస్థితి వుందని ఆయన చెప్పారు. అదేవిధంగా, రాష్ట్ర విభజన జరిగిన అనంతరం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ని కలిశారని, దానివల్ల ఏం ఉపయోగం జరిగిందో తనకు తెలియదని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు.