తెలుగోడి కిడ్నాప్

 

నైజీరియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన టంగుటూరి శ్రీనివాస్ అనే ఇరవై ఆరేళ్ళ యువకుడు కిడ్నాప్ అయ్యాడు. చింతలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెండున్నర సంవత్సరాలుగా నైజీరియాలోని లెబసీమెరిడ్ సైట్ ఎక్విడెంట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అక్టోబర్ 20వ తేదీన వివాహ నిశ్చితార్థం కోసం చింతలపూడికి వచ్చిన శ్రీనివాస్ 30వ తేదీన మళ్ళీ నైజీరియాకి వెళ్ళాడు. అయితే గత వారం రోజులుగా అతని నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం రావడం లేదు. నైజీరియాలో నివసించే మరో తెలుగు వ్యక్తి చంద్రశేఖర్ శ్రీనివాస్ కిడ్నాప్ అయ్యాడంటూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. బుధవారం శ్రీనివాస్ తనకు కేటాయించిన క్వార్టర్‌లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అపహరించారు. శ్రీనివాస్‌ని డబ్బు కోసం ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. శ్రీనివాస్‌తోపాటు మరో ఇద్దరు పాకిస్తానీయులు కూడా కిడ్నాప్ అయినట్టు సమాచారం.