చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. ప్రపంచం చూపు ఏపీ వైపు

ప్రపంచం మొత్తం  ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. రాష్ట్ర విభజన తో అప్పులు వినా ఆస్తులు లేని రాష్ట్రంలో, కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా అన్నిటికీ మించి రెవెన్యూ లోటుతో విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక అనాధలా మిగిలింది. అలాంటి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా రూపుదిద్దగలిగేది ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమేనని విశ్వసించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు  2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని కట్టబెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్  తొలి ముఖ్యమంత్రిగా  చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటూ రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి తొలి అడుగులు పడ్డాయి. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం నిర్మాణం ఆరంభం కావడమే కాదు.. నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. మూడు వంతుల ప్రాజెక్టు పూర్తయ్యింది. అంతే కాదు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో చంద్రబాబు ఐదేళ్ల హయాంలో మూడేళ్లు దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. ప్రజలకు విద్యుత్ కష్టాలు లేవు. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందాయి.పింఛనర్లకూ అదే తేదీన ఠంచనుగా పించన్లు అందాయి. 
ప్రపంచం నలుమూలల నుంచీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. కియా వంటి పలు పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లకు దీటుగా ఏపీలో ఐటీ పుంజుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి ఎంతో కాలం పట్టదని అంతా భావిస్తున్న సమయంలో 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. 
వైసీపీ విజయం సాధించి.. జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. ఆ నాటి నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అంధయుగం నడుస్తున్నదా అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు విజన్ కారణంగా, చంద్రబాబు కష్టం కారణంగా రాష్ట్రంలో గ్రౌండింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఎన్నో పరిశ్రమలు ముఖం చాటేశాయి. అప్పటికే గ్రౌండ్ అయిన మరిన్న పరిశ్రమలు రాష్ట్రం దాటి వెళ్లిపోయాయి. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలో ఉన్న అమరరాజా బ్యాటరీస్ వంటి సంస్థలు సైతం రాష్ట్రంలో కొనసాగడం మా వల్ల కాదని పొరుగు రాష్ట్రానికి తరలిపోయాయి. రాష్ట్రంలో అరాచక పాలన ఐదేళ్ల పాటు యథేచ్ఛగా కొనసాగింది. సమాజంలోని ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా జగన్ సర్కార్ వేధింపులకు గురి చేసింది. పాలన కక్ష సాధింపు, దోపిడీ, దౌర్జన్యం, అవినీతే అన్నట్లుగా జగన్ హయాంలో రాష్ట్రంలో పాలన సాగింది. 

2024 ఎన్నికలలో జనం జగన్ దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించే చంద్రబాబు నాయకత్వానికి పట్టం కట్టారు. చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే రాష్ట్రంలో ప్రొగ్రసివ్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచం చూపు మళ్లీ ఏపీ వైపు మళ్లింది. తరిలిపోయిన పరిశ్రమలు ఒక్కటొక్కటిగా మళ్లీ రాష్ట్రానికి రావడం మొదలైంది.పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో  తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, విస్తరించడానికి ఆసక్తి చూపుతున్నాయి. 
తెలుగుదేశం కూటమి కొలువుదీరిన నాలుగు నెలల వ్యవధిలోనే ఇంతటి మార్పు కనిపించడానికి ప్రధాన కారణం విజనరీ చంద్రబాబు. ఆయన ప్రూవెన్ ఎబిలిటీ. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ ముఖచిత్రం మారిపోయింది. టాటా చైర్మన్ తో  రాష్ట్ర ఐటీ మంత్రి కేవలం గంటన్నర భేటీతోనే రాష్ట్రానికి టీసీఎస్ వచ్చింది. ఒక్క ఈమెయిల్ తో సత్య నాదెళ్ల అప్పాయింట్ మెంట్ ఖరారైంది.  లోకేష్ వారంరోజుల అమెరికా పర్యటనలో  ఆయనకు దిగ్గజ పరిశ్రమలన్నీ రెడ్ కార్పెట్ పరియాయి. కేవలం ఏదో కలిశాం, వచ్చేశాం అన్నట్లుగా కాకుండా నారా లోకేష్ సమావేశమైన దిగ్గజ కంపెనీలన్నీ రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూలంగా స్పందించాయి. అసలు నారా లోకేష్ కు అమెరికాలో పారిశ్రామిక వేత్తలు రెడ్ కార్పెట్ పరిచారంటే అందుకు కారణం ఆయన ఎఫిషియెన్సీకి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోడు కావడమే. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ కారణంగానే ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది.