డబ్బు మీద అతి ప్రేమ మంచిది కాదు
posted on Nov 1, 2024 6:07PM
ఇప్తెకార్ డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తున్నాడు. చిట్టీల వ్యాపారం చేసి లక్షల రూపాయలు సంపాదించాడు. ఆడ పిల్లల పెళ్లి, అనారోగ్యం వంటి కారణాలతో తన వద్ద చీటీ పాడుకునేవారికి చిట్టీ డబ్బులు మొత్తం ఇచ్చేవాడు కాదు. కమిషన్ ఎక్కువగా తీసుకునేవాడు. అవసరం అని తెలియగానే ఇప్తెకార్ తన దైన స్టైల్ లో దోచేసుకునే వాడు
ఒక రోజు బాధితులు మౌలానా దగ్గరికి వచ్చారు.
చీటీ బాధితులు: సలాం వాలేకుం మౌలానా సాబ్
మౌలానా: వాలేకుం సలాం భాయ్ , కైరియత్ తష్రీప్ రఖ్ నా ( రండి కూర్చొండి)
చీటీ బాదితులు: మౌలానా సాబ్ ఇప్తెకార్ చిట్టీల వ్యాపారంలో కస్టమర్లను మోసం చేస్తున్నాడు. చీటీ డబ్బులు అడిగితే ఏదో ఒకరకంగా మోసం చేస్తున్నాడు. చీటీ డబ్బులు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నాడు. తన కు ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నాడు. చిట్టీల వ్యాపారం ప్రారంభించే ముందు ప్రతీ ఒక్కరితో నమ్మికగా ఉండే వాడు. ఇపుడు పూర్తిగా మారిపోయాడు.
మౌలానా: డబ్బు, ఆరోగ్యం పరువు ప్రతిష్టగా తీసుకుంటే ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. ప్రపంచమే ఒక ముసాఫిర్ ఖానా. పుట్టుక, చావులు ఇక్కడ షరామామూలే. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. డబ్బు, ఆరోగ్యం ఇవన్నీ తాత్కాలికం. అయినా మనిషి వీటి పట్ల ప్రేమను పెంచుకుంటున్నాడు. ఇవి ఎప్పుడైనా మన నుంచి దూరమవుతాయి. అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోతాం. ధర్మం అనేది ఎల్లవేలలా మన వెంటే ఉంటుంది. ధర్మాన్ని లాక్కోవడం ఎవరి తరం కాదు. అల్లా కోరుకునేది కూడా ధర్మాన్ని ఆచరించడం. ధర్మాన్ని ఆచరించడం వల్ల డిప్రెషన్ లో వచ్చిన వారు లేరు. డబ్బు, ఆరోగ్యం మీద మమకారం పెంచుకుంటే డిప్రెషన్ వస్తుంది. కాంపిటేషన్ వల్ల కూడా మనిషి డిప్రెషన్ లో వెళ్లిపోతున్నాడు. ఈ భౌతిక ప్రపంచం మీద ప్రేమ పెంచుకోవద్దు. లోభం కూడా మంచిది కాదు. కుక్క కూడ లోభి లక్షణాలతో నిండి ఉంటుంది. కుక్క తమ యజమానిని చూసి తోక ఊపుతుంది. కానీ తన జాతికి చెందిన మరో కుక్క తన యజమాని గేటు ముందు నుంచి వెళ్లగానే తన అసలు స్వరూపం చూపిస్తుంది, నేను తినే రొట్టె వేరే కుక్క తన్నుకుపోతుందని ఈర్శ్య, ద్వేషంతో రగిలి పోతుంది. అరుస్తుంది. మరో కుక్క కండలను తన కోరపళ్లతో కొరికి రక్త సిక్తం చేస్తుంది. దీనిని బట్టి కుక్క విశ్వాసం గల జంతువు అనేది అపప్రద. ఈ విషయం కుక్కను పెంచుకునే యజమానికి కూడా తెలియదు. అది విశ్వాసం గల జంతువు అనుకుంటూ బతికేస్తున్నాడు. ఇప్తెకార్ కూడా విశ్వాసం గల వ్యక్తి కాదు అని అతని చేతల్లో తెలిసిపోయింది.జాగ్రత్తగా ఉండండి అంటూ మౌలానా హితవు పలికాడు.
బదనపల్లి శ్రీనివాసాచారి