కేటీఆర్ పాదయాత్ర.. 2028 ఎన్నికల్లో పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుదామనేనా?

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నది. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ, రైతు భరోసా నిధులు వంటి విషయాలలో రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ కు పుంజుకునేందుకు ఇచ్చిన అవకాశాలను బీఆర్ఎస్ సమర్థంగా ఉపయోగించుకోవడంలో విఫలమైంది. పార్టీ  అధినేత మౌనం కావచ్చు. పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం కావచ్చు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ స్ఫూర్తి అన్నది కొరవడటమే ఆ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను సమర్ధంగా తిప్పి కొట్టలేకపోవడానికి ప్రధాన కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీగా సుదీర్ఘ కాలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సాగించిన ఆ పార్టీ రాష్ట్ర విభజన తరువాత అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తరువాత కేసీఆర్ స్వయంగా టీఆర్ఎస్ ఇంకెంత మాత్రం ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించారు. ఆ తరువాత ఆపరేషన్ ఆకర్ష్ తో ఉద్యమ సమయంలో పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడిన వారినీ, సమైక్య ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా ఉన్నవారినీ కూడా పార్టీలో చేర్చుకున్నారు. అది వేరే సంగతి. రెండో సారి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ పార్టీలోని తెలంగాణ సదాన్ని తీసేసి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి ఒక్క సారిగా జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచేసుకున్నారు. తన తనయుడు కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించి భవిష్యత్ ముఖ్యమంత్రిగా బిల్డప్ ఇచ్చారు. ఇది పార్టీలోని కొందరికి రుచించలేదనుకోండి అది వేరే సంగతి.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైన తరువాత కేసీఆర్ మౌనం పార్టీ క్యాడర్ ను నిస్తేజంగా మార్చేసింది. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఎంత దూకుడుగా వెళ్లినా క్యాడర్ లో ఉత్సాహం నింపడంలో పూర్తిగా సఫలం కాలేకపోయారు. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ కంటే ముందున్నారన్న భావన పార్టీ క్యాడర్ లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే పార్టీ బలోపేతం తో పాటు తన నాయకత్వాన్నీ స్థిరపరుచుకునే లక్ష్యంతో కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. దీపావళి రోజున  (అక్టోబర్ 31) ఆస్క్ కేటీఆర్ అన్న కార్యక్రమాన్ని నిర్వహించిన కేటీఆర్ ఆ సందర్భంగా తన పాదయాత్ర విషయాన్ని ప్రకటించారు. పాదయాత్రకు సంబంధించి పూర్తి వివరాలు అంటే ఎప్పుడు ఎక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభమౌతుంది. రూట్ మ్యాప్ ఏమిటి అన్న వివరాలను త్వరలో వెల్లడిస్తానని కేటీఆర్ చెప్పారు. 

ప్రజలతో మమేకమై అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేయడం తెలుగు రాష్ట్రాలలో కత్తేమీ కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. అలాగే చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి 2014 లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత వైఎస్ జగన్ కూడా పాదయాత్ర ద్వారానే 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక లోకేష్ యువగళం పాదయాత్ర 2024 ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడింది. లోకేష్ ను బలమైన ప్రజా నేతగా ఆవిష్కరించింది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాదయాత్ర చేయనున్నారు. తద్వారా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంతో పాటు 2028 లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను బలంగా ప్రొజెక్టు చేసుకోవాలని భావిస్తున్నారు.