బాబోయ్... స్వచ్ఛ ‘భార’త్
posted on Nov 15, 2015 8:21AM

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘స్వచ్ఛ భారత్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు జనం చాలా బావుందని అనుకున్నారు. మన దేశాన్ని మనం శుభ్రంగా వుంచుకోవాలనే కాన్సెప్ట్ మంచిదే కదా. ప్రధాని పిలుపుకు స్పందించి చాలామంది జనం, రాజకీయ నాయకులు చీపురు పట్టుకుని రోడ్డు మీదకు వచ్చి దుమ్ము రేపారు. ప్రధాని ఇచ్చిన పిలుపుతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి. దేశంలోని చాలా ఊళ్ళు, పట్టణాలు, నగరాల ముందు ‘స్వచ్ఛ’ అనే పేరు తగిలించేసి రోడ్లు ఊడ్వటం, ఫొటోలకు పోజులు ఇవ్వడం రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. ఇంతవరకూ బాగానే వుంది. ఇప్పుడు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం జనం జేబులకు భారంగా మారింది... అదే జనాలందరూ బాబోయ్ అనేలా చేస్తోంది.
నానా తంటాలు పడి, అన్ని రకాల టాక్సులూ కట్టి జనం సంపాదించుకున్న డబ్బును ప్రభుత్వం మళ్ళీ రకరకాల టాక్సులతో లాక్కుంటోందన్న అభిప్రాయాలు వున్నాయి. అన్ని టాక్సులకు తోడు ఇప్పుడు 14 శాతం సర్వీస్ టాక్స్‌ని కూడా వసూలు చేస్తున్నారు. ఇప్పడు ఆ సర్వీస్ టాక్స్‌కి ‘స్వచ్ఛ భారత్ సెస్’ పేరిటో మరో .5 శాతం కలిపి మొత్తం 14.5 శాతం సర్వీస్ టాక్స్ వసూలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం దేశం మొత్తం ఒక్కసారిగా కెవ్వుమనేలా చేసింది. స్వచ్ఛభారత్ అంటే శ్రమదానమే అనుకున్నాం గానీ, ఇలా సంపాదనను కూడా దానం చేయాల్సి వస్తుందని ఊహించలేదని జనం అనుకుంటున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజల్ని కూడా భాగస్వాములను చేస్తామని ప్రభుత్వం అంటూవుంటే ఇంకేంటో అనుకున్నాం... ఇలా జేబులోంచి డబ్బు లాగేసి ఆర్థికంగా కూడా భాగస్వాములను చేస్తారని ఊహించలేదని జనం అనుకుంటున్నారు. స్వచ్ఛ భారత్ అంటే వీధులను క్లీన్ చేయడం అనుకున్నాం గానీ, తమ జేబులను కూడా క్లీన్ చేయడం అనుకోలేదని అంటున్నారు.