సావిత్రిని ‘బ్రహ్మ రాక్షసి’ అని తిట్టిన ఎస్‌.వి.రంగారావు.. దానికామె ఏం చేసిందో తెలుసా?

పాతతరం నటుల ప్రస్తావన వస్తే మొదట చెప్పుకునే ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ తర్వాత ఖచ్చితంగా వినిపించే పేరు ఎస్‌.వి.రంగారావు. పౌరాణికమైనా, సాంఘికమైనా.. అది ఎలాంటి క్యారెక్టర్‌ అయినా అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల్ని రంజింపజేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తన సహజ సిద్ధమైన నటనతో ఎన్నో అద్భుతమైన పాత్రల్ని పోషించిన ఎస్వీఆర్‌ సినీ జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి, ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. కొందరు నటీనటులతో, దర్శకులతో విభేదించినా నటుడిగా ఆయనకు వున్న విలువ ఏమాత్రం తగ్గేది కాదు. కొన్ని పాత్రలు ఆయన కోసమే పుట్టాయా అనిపిస్తాయి. మరికొన్ని పాత్రలు ఎస్వీఆర్‌ తప్ప మరెవ్వరూ చెయ్యలేరు అనేంతగా అలరిస్తాయి. తెలుగు సినిమా చరిత్రలో ఒక మహానటుడిగా తన ముద్ర వేసిన ఎస్‌.వి.రంగారావు జయంతి జూలై 3. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలు, వివాదాల గురించి తెలుసుకుందాం.

మహానటి సావిత్రి సెట్‌లో ఉన్నారంటే.. ఆరోజు జరిగే సీన్‌లో నటించే మిగతా నటీనటులకు ఆందోళనగానే ఉండేది. ఎందుకంటే ఎదుట ఉన్నవారు నటనలో ఎంతటి దిగ్గజమైనా తన హావభావాలతో వారిని మట్టి కరిపిస్తుంది. అలాంటి పేరున్న సావిత్రి నటించిన ఓ తమిళ సినిమా షూటింగ్‌ సమయంలో ఒక తమాషా అయిన సంఘటన జరిగింది. ఆ సినిమాలో సావిత్రితోపాటు శివాజీ గణేశన్‌, ఎస్‌.వి.రంగారావు కూడా నటిస్తున్నారు. ఆరోజు ఓ సీన్‌ చిత్రీకరణ ముగ్గురితో జరగాల్సి ఉంది. శివాజీ గణేశన్‌ తన మేకప్‌ పూర్తి చేసుకొని సెట్‌కి వచ్చారు. అదే సమయంలో ఎస్వీఆర్‌ కూడా రావడంతో ఆయన పాదాలకు నమస్కరించి.. ‘ఈ ఒక్క సీన్‌ అయినా నాకు వదిలిపెట్టరా రాక్షసుడా..’ అన్నారట. దానికి ఎస్వీఆర్‌ పగలబడి నవ్వి ‘ఒక్కసారి వెనక్కి చూడరా.. అక్కడ బ్రహ్మరాక్షసి ఉంది. మనిద్దరినీ మింగేస్తుంది’ అని సావిత్రిని ఉద్దేశించి అన్నారట.  అది విన్న సావిత్రి రాక్షసిలా వికటాట్టహాసం చేసి అందర్నీ నవ్వించారు. 

ఎస్వీఆర్‌ సెట్‌లో ఎంత సరదాగా ఉంటారో.. అంతే మొండితనం కూడా ప్రదర్శిస్తారు. ఒక్కోసారి దర్శకులతో కూడా గొడవకు దిగుతుంటారు. అలాంటి ఓ ఘటన దర్శకరత్న దాసరి నారాయణరావు, ఎస్వీఆర్‌ మధ్య జరిగింది. దాసరి తొలి చిత్రం ‘తాత మనవడు’ ఆరోజుల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఎస్వీఆర్‌ తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఆ సినిమాను నిర్మించిన కె.రాఘవ.. తదుపరి సినిమా కూడా దాసరి డైరెక్షన్‌లోనే చేశారు. ఆ సినిమా పేరు ‘సంసారం సాగరం’. ఈ సినిమా షూటింగ్‌లో దాసరి, ఎస్వీఆర్‌ మధ్య ఓ వివాదం జరిగింది. 

జయంతితో కలిసి నటించే ఆ సీన్‌కి సంబంధంచిన డైలాగ్‌ పేపర్స్‌ చూస్తూ విసుక్కున్నారు ఎస్వీఆర్‌. ‘ఈ సీన్‌లో ఇంత లెంగ్తీగా ఉండే డైలాగ్స్‌ అవసరం లేదు’ అంటూ అందులోని కొన్ని డైలాగ్స్‌ తొలగించారు ఎస్వీఆర్‌. అది చూసిన దాసరి అవి తర్వాతి సీన్‌కి, క్లైమాక్స్‌కి లింక్‌ అయి ఉన్న డైలాగులని, తప్పనిసరిగా అవి ఉండాల్సిందేనని పట్టుపట్టారు. ఆ మాటకు కోపం తెచ్చుకున్న ఎస్వీఆర్‌ ‘నేను ఇంత సీనియర్‌ని నాకే ఎదురు చెప్తావా?’ అంటూ షూటింగ్‌ స్పాట్‌ నుంచి బయటికి వచ్చేసి కారులో వెళ్లిపోయారు. ఆ కారు వెనుక నిర్మాత రాఘవ మరో కారులో బయల్దేరారు. ఎస్వీఆర్‌ కారును రాఘవ ఛేజ్‌ చేయడం మొదలు పెట్టారు. మధ్యలోనే ఎస్వీఆర్‌ తన కారును ఆపి యూ టర్న్‌ తీసుకొని సరాసరి సెట్‌కి వచ్చేశారు. అది చూసి సెట్‌లోని వారు, ఆయన వెనకే వచ్చిన రాఘవ.. అందరూ ఆశ్చర్యపోయారు. ‘నువ్వు రాసిన డైలాగులే చెప్తానులే’ అంటూ ఆ సీన్‌ పూర్తి చేశారు ఎస్వీఆర్‌. షూటింగ్‌ పూర్తయిన తర్వాత ‘నేను చెప్పాను కదా అని నువ్వు డైలాగుల్ని తగ్గించుకోలేదు. డైరెక్టర్‌ అంటే నీలాగే ఉండాలి. తప్పకుండా నువ్వు పెద్ద డైరెక్టర్‌ అవుతావు’ అని దాసరిని మెచ్చుకుంటూ ఆశీర్వదించారు. 

సినిమా రంగంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. కొన్ని విషయాల్లో దర్శకనిర్మాతలు, నటీనటులు పట్టుదలతో ఉంటారు. అయితే అది సినిమా ఔట్‌పుట్‌ బాగా రావడానికి వారు పడే తపనే తప్ప ఒకరిపై మరొకరికి ఎలాంటి పగలు, ద్వేషాలు ఉండవు. ఇలాంటి వివాదాలు ఎస్వీ రంగారావు సినీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా ఆయనలోని మహానటుడ్నే చూసేవారు దర్శకనిర్మాతలు. ఎస్వీఆర్‌ మనకు దూరమై 50 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ స్మరించుకుంటున్నామంటే.. అదే ఆయనలోని గొప్పతనం. జూలై 3 ఎస్వీఆర్‌ జయంతి సందర్భంగా ఆ మహానటుడికి ఘనంగా నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.

Related Segment News