మహేష్‌తో అనుకున్న సినిమా ‘యమస్పీడ్‌’గా ఆ హీరోతో...


‘దానే దానే పె లిఖా హై ఖానే వాలే కా నామ్‌’ అనే హిందీ సామెత గురించి అందరికీ తెలిసిందే. ఏది ఎవరికి ప్రాప్తమో వారికే దక్కుతుందనే అర్థం ఉన్న ఆ సామెతను సినిమా రంగంలో నటీనటులకు కూడా అన్వయిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక హీరో కోసం అనుకున్న కథతో మరో హీరో సినిమా చేస్తాడు. ఒక హీరో రిజెక్ట్‌ చేసిన కథతో మరో హీరో సూపర్‌హిట్‌ కొడతాడు. ఇలాంటి అనుభవాలు హీరోలందరి కెరీర్‌లోనూ ఉంటాయి. అలాంటి ఓ సినిమా గురించి కమెడియన్‌ అలీ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 

సూపర్‌స్టార్‌ కృష్ణతో ‘నెంబర్‌వన్‌’ వంటి సూపర్‌హిట్‌ సినిమా చేసిన తర్వాత ఎస్‌.వి.కృష్ణారెడ్డికి మహేష్‌బాబును హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తూ ఓ సినిమా చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. ఒకసారి హైదరాబాద్‌ నుంచి చెన్నయ్‌ వెళ్ళే విమానంలో అనుకోకుండా కలిసిన సూపర్‌స్టార్‌ కృష్ణతో ‘నా దగ్గర ఓ మంచి కథ ఉంది సార్‌. మీ అబ్బాయితో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను’ అన్నారు కృష్ణారెడ్డి. చెన్నయ్‌ వెళ్ళే లోపు తను అనుకున్న కథ మొత్తం చెప్పారాయన. కథ విన్న కృష్ణ చాలా బాగుందని మెచ్చుకున్నారు. అయితే మహేష్‌ ఇంకా చిన్నవాడని, అతను హీరోగా ఇంట్రడ్యూస్‌ అవ్వడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుందని చెప్పారు కృష్ణ. ఈ గ్యాప్‌లో ఒక విచిత్రం జరిగింది. ‘మాయలోడు’ ఆడియో ఫంక్షన్‌లో ‘చినుకు చినుకు అందెలతో..’ పాటకు అలీ డాన్స్‌ పెర్‌ఫార్మ్‌ చేశారు. అది చూసిన కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు ఒక ఆలోచన వచ్చింది. తాము అనుకున్న కథలో కామెడీ, సెంటిమెంట్‌ ఉంది. అలీ అయితే కామెడీ, సెంటిమెంట్‌ చెయ్యగలడు. అలాగే డాన్స్‌ కూడా చేస్తాడు. ఆ క్యారెక్టర్‌కి అలీ పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతాడని, అతనితోనే సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి. 

ఒకరోజు అలీని తమ ఆఫీస్‌కి పిలిపించి అగ్రిమెంట్‌ మీద సంతకం పెట్టమన్నారు కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి. ‘అంతకుముందు చేసిన సినిమాలకు అగ్రిమెంట్‌ చెయ్యలేదు కదా. ఇదేంటి కొత్తగా’ అని అడిగారు అలీ. ‘నువ్వు సంతకం పెట్టు. చెప్తాం’ అన్నారు. అలీ సంతకం చేసిన తర్వాత ‘నేను నెక్స్‌ట్‌ చేయబోయే సినిమాలో నువ్వే హీరో’ అన్నారు కృష్ణారెడ్డి. అప్పుడు అలీ ఆశ్చర్యపోయి ‘కామెడీ చెయ్యకండి సార్‌.. నేను హీరో ఏమిటి?’ అన్నారు. ‘నిజమేనయ్యా.. నువ్వే హీరో’ అన్నారు అచ్చిరెడ్డి. అలా కమెడియన్‌ కాస్తా హీరో అయిపోయారు. ఆ సినిమాయే ‘యమలీల’. అలా మహేష్‌తో చెయ్యాలనుకున్న సినిమా చివరికి అలీతో చేశారు కృష్ణారెడ్డ్డి. అయితే ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్‌ ‘యమస్పీడ్‌’. కథను బట్టి, అందులో యమధర్మరాజు పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ‘యమలీల’గా పేరు మార్చారు. హీరోగా ఆ సినిమాకు అలీ అందుకున్న పారితోషికం రూ.50 వేలు. ‘యమలీల’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన తర్వాత అలీకి హీరోగా చాలా అవకాశాలు వచ్చాయి. హీరోగా అలీ అందుకున్న అత్యధిక పారితోషికం రూ.15 లక్షలు. కమెడియన్‌గా 1000కి పైగా సినిమాలు చేసిన అలీ హీరోగా 25 సినిమాలు చేశారు.

Related Segment News