మనీషా కోయిరాలా మృతి.. పేపర్‌లో ప్రకటన ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగింది?

ఒక మంచి సినిమా తియ్యాలంటే యూనిట్‌లోని అందరి సహకారం దర్శకుడికి ఉండాలి. ఆ సినిమాని జనరంజకంగా తీర్చి దిద్దే బాధ్యత దర్శకుడిదే అవుతుంది. ఆర్టిస్టుల నుంచి మంచి నటన రాబట్టుకోవడం, సాంకేతిక నిపుణుల నుంచి మంచి ఔట్‌పుట్‌ తీసుకోవడం అతని పని. ఇవన్నీ సక్రమంగా జరిగినపుడే ఒక మంచి సినిమా తయారవుతుంది. సినిమా పూర్తయిన తర్వాత దాన్ని రిలీజ్‌ చేయడం, జనంలోకి ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్ళడం నిర్మాత పని. అంటే పబ్లిసిటీ అనే ప్రక్రియను సక్రమంగా వినియోగించుకున్నప్పుడే వారు చేసిన సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరుగుతాయి. 

ఈ విషయంలో కొందరు వక్రమార్గాన్ని కూడా ఎన్నుకుంటారు. తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ‘క్రిమినల్‌’ విషయంలో ఇదే జరిగింది. సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో నిర్మాత ముఖేష్‌ భట్‌ చేసిన ఒక క్రిమినల్‌ పనికి అందరూ షాక్‌ అయ్యారు. సినిమాని ప్రమోట్‌ చేసుకునే పద్ధతి ఇది కాదు అనీ, సినిమా కోసం ఇంతగా దిగజారిపోతారా అనీ, ప్రపంచంలోనే అతి పెద్ద వరస్ట్‌ పబ్లిసిటీ ఇదేననీ.. ఇలా నిర్మాత ముఖేష్‌ భట్‌ని చాలా దారుణంగా అందరూ విమర్శించారు. ఇంతకీ జరిగిందేమిటంటే..

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా ప్రధాన పాత్రల్లో మహేష్‌భట్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘క్రిమినల్‌’. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించారు. హరిసన్‌ ఫోర్డ్‌ హీరోగా నటించిన అమెరికన్‌ మూవీ ‘ది ఫగిటివ్‌’కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. తెలుగు 1994 అక్టోబర్‌ 14న తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ అవ్వగా, తొమ్మిది నెలల తర్వాత హిందీ వెర్షన్‌ 1995 జూలై 21న విడుదలైంది. తెలుగులో బిలో ఏవరేజ్‌ సినిమాగా నిలిచింది ‘క్రిమినల్‌’. అయితే మ్యూజికల్‌గా ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. ఈ సినిమాలోని ‘తెలుసా.. మనసా..’ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. హిందీలో కూడా ఈ పాట సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమాపై నాగార్జున చాలా హోప్స్‌ పెట్టుకున్నాడు. కానీ, అతన్ని నిరాశ పరచింది. 

తెలుగు వెర్షన్‌కి కె.ఎస్‌.రామారావు నిర్మాత కాగా, హిందీ వెర్షన్‌కి మహేష్‌భట్‌ సోదరుడు ముఖేష్‌భట్‌ నిర్మాత. తెలుగులో రిలీజ్‌ అయిన 9 నెలల తర్వాత హిందీలో ఈ సినిమా రిలీజ్‌ అవడం, తెలుగులో సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో హిందీ వెర్షన్‌కి డిఫరెంట్‌గా పబ్లిసిటీ చెయ్యాలని అనుకున్నాడు ముఖేష్‌ భట్‌. అందులో భాగంగా పేపర్‌లో ఒక యాడ్‌ ఇచ్చాడు. ‘మనీషా కోయిరాలా మృతి’ అనే టైటిల్‌తో ఆ యాడ్‌ వచ్చింది. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇండస్ట్రీలో ఆందోళన మొదలైంది.  మనీషా కోయిరాలాకు లెక్కకు మించిన కాల్స్‌ వచ్చాయి. విషయం తెలుసుకున్న మనీషా కూడా షాక్‌ అయింది. అలాంటి ఫాల్స్‌ పబ్లిసిటీ చేసిన నిర్మాత ముఖేష్‌ భట్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. అంతేకాదు, మీడియా నుంచి ఇండస్ట్రీ నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 

అలాంటి పబ్లిసిటీతో రిలీజ్‌ అయిన ‘క్రిమినల్‌’ హిందీ వెర్షన్‌ లాభాలను ఆర్జించింది. రెండు కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా నాలుగు కోట్ల బిజినెస్‌ చేసింది. ఈ సినిమా రిలీజ్‌ అయిన సమయంలోనే అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా నటించిన ‘హల్‌చల్‌’, ఆమిర్‌ఖాన్‌, రజినీకాంత్‌ కలిసి నటించిన ‘ఆతంక్‌ హి ఆతంక్‌’ సినిమాలు విడుదలయ్యాయి. కానీ, ఈ రెండు సినిమాల కంటే ‘క్రిమినల్‌’కే ఎక్కువ కలెక్షన్స్‌ రావడం విశేషం.

Related Segment News