డైరెక్టర్‌గా తొలి సినిమా.. సావిత్రి పతనానికి అదే కారణమైందా?

మహానటి సావిత్రి గురించి, ఆమె నటించిన సినిమాల గురించి, ఆమె జీవితంలోని వెలుగు నీడల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగానే కాకుండా దర్శకురాలిగా మారి కొన్ని సినిమాలను రూపొందించారు. అయితే సావిత్రి దర్శకురాలిగా మారడానికి కారణాలు ఏమిటి? ఆమెకు దర్శకురాలిగా అవకాశం ఇచ్చింది ఎవరు? ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలను 55 సంవత్సరాల క్రితం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు మహానటి సావిత్రి. 

‘అన్నపూర్ణ పిక్చర్స్‌ బేనర్‌లో దుక్కిపాటి మధుసూదనరావుగారు నిర్మించే సినిమాలకు ఎక్కువ శాతం ఆదుర్తి సుబ్బారావుగారు దర్శకత్వం వహించేవారు. ఒకరోజు మధుసూదనరావుగారు నా దగ్గరకు వచ్చి ‘మన డైరెక్టర్‌ సుబ్బారావు బిజీగా ఉన్నాడు. మన నెక్స్‌ట్‌ పిక్చర్‌ను నువ్వు డైరెక్ట్‌ చేస్తావా’ అని అడిగారు. నాకు వెంటనే నవ్వు వచ్చేసింది. అలా నవ్వుతూనే ఉన్నాను. దానికి నిర్మాతగారు ‘హాస్యానికి ఆ మాట అనడం లేదు. నిజంగా నువ్వు డైరెక్ట్‌ చెయ్యాలి’ అన్నారు. అయినా నేను ఇంకా నవ్వు ఆపలేదు. నా నవ్వు చూసి అర్థం చేసుకున్న ఆయన మరేమీ అనకుండా వెళ్లిపోయారు. ఆయన చెప్పిన మాట గురించి ఒకసారి ఆలోచించాను. నాకు సినిమా తీసేంత సామర్థ్యం ఉందా అనిపించింది. తర్వాత ఆ విషయాన్ని నేను మర్చిపోయాను. 

ఆ తర్వాత దర్శకుడు వి.మధుసూదనరావుగారి సతీమణి సరోజిని నా దగ్గరకి వచ్చారు. ‘నేను ఒకటి అడుగుతాను నువ్వు తప్పకుండా  ఒప్పుకోవాలి’ అన్నారు. ‘సరే’ అన్నాను. ఇంతకీ ఏమిటంటే.. ఆడవాళ్లంతా కలిసి ఒక సినిమా చెయ్యాలన్నది సరోజిని ఆలోచన. అది విన్న నేను కాసేపు ఏమీ మాట్లాడలేదు. నా సమాధానం కోసం ఆమె ఎదురుచూస్తోంది. ‘ఆయన్ని కనుక్కొని చెబుతాను’ అంటూ ఫోన్‌ చేశాను. విషయం చెప్పగానే తప్పకుండా చెయ్యి అన్నారు. అలా ‘చిన్నారి పాపలు’ టైటిల్‌తో సినిమా స్టార్ట్‌ చేశాం. అయితే విశేషం ఏమిటంటే ఈ సినిమాకి చాలా మంది మహిళలు టెక్నీషియన్లు పనిచేశారు. ఈ సినిమాకి పి.లీలగారు సంగీతం, కథను సరోజిని, మోహన కళా దర్శకురాలిగా, నృత్య దర్శకురాలిగా రాజసులోచన, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కొప్పరపు సరోజిని పనిచేశారు. సినిమా ప్రారంభమైంది. సావిత్రి ఎలా డైరెక్ట్‌ చేస్తుందో చూడాలని ప్రముఖ దర్శకులు షూటింగ్‌ దగ్గరికి వచ్చేవారు. సినిమాలో నటించిన షావుకారు జానకి ‘నువ్వు మొదటిసారి డైరెక్ట్‌ చేస్తున్నట్టు లేదు. ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న డైరెక్టర్‌లా చేశావు’ అన్నారు. ఇలా నేను ఒక్కసారే డైరెక్టర్‌ అయిపోవడం వెనుక కొన్ని కారణాలు వున్నాయి. నటించే సమయంలోనే కొన్ని సీన్స్‌ని అలా చేస్తే బాగుండేది అనే ఆలోచన వచ్చేది. ఏ సినిమాకైనా డైరెక్టర్‌ చెప్పినట్టుగానే చెయ్యాలి. డైరెక్షన్‌ చెయ్యడం అంత ఈజీ కాదు అని నేను డైరెక్టర్‌ అయిన తర్వాత తెలిసొచ్చింది’ అని చెప్పారు సావిత్రి.x

ఈ చిత్రం 14 ఆగస్ట్‌, 1968న రిలీజ్‌ అయింది. అయితే ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా తర్వాత ‘చిరంజీవి’, ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు దర్శకత్వ వహించారు సావిత్రి. ‘చిన్నారి పాపలు’ సినిమా నిర్మాణంలో ఎంతో మంది భాగస్వాములు ఉన్నారు. వారితో అభిప్రాయ భేదాలు రావడంతో సినిమా నిర్మాణం సజావుగా సాగలేదు. దాంతో సొంత ఆస్తులు అమ్మి షూటింగ్‌ పూర్తి చెయ్యాల్సి వచ్చింది. సావిత్రి పతనం ఈ సినిమాతోనే ప్రారంభమైంది. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘మూగమనసులు’ చిత్రాన్ని తమిళ్‌లో శివాజీ గణేశన్‌తో నిర్మించారు సావిత్రి. ఆ సినిమా కూడా ఫ్లాప్‌ అవ్వడంతో సావిత్రి ఆర్థికపరంగా మరింత కుంగిపోయారు.

Related Segment News