ఆ న్యాయమూర్తికి బెదిరింపు లేఖ!

 

ముంబై ప్రేలుళ్ళ పాత్రధారిగా గుర్తింపబడిన యాకుబ్ మీమన్ కి ఉరిశిక్షని ఖరారు చేసిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తి దీపక్ మిశ్రాకి గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఒక బెదిరింపు లేఖ వచ్చింది. ఆయన ఇంటి గేటు వద్ద పడి ఉన్న ఆ లేఖను చూసిన ఆయన భద్రతా సిబ్బంది దానిని తుగ్లక్ రోడ్డులో గల పోలీస్ స్టేషన్లో పోలీసులకి అందజేసి పిర్యాదు చేసారు. డిల్లీ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ముకేష్ కుమార్ మీనా ఈ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. డిల్లీలోని ఉగ్రవాద నిరోధ బృందం తక్షణమే రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టింది.

 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాకుబ్ మీమన్ రెండవసారి పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్ని కూడా తిరస్కరించిన తరువాత ఆరోజు అర్ధరాత్రి యాకుబ్ మీమన్ తరపున అతని న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లి యాకుబ్ ఉరిశిక్షని రద్దు చేయమని కోరారు. వారి అభ్యర్ధనను మన్నించవలసిన అవసరం లేకపోయినప్పటికీ ఆయన తక్షణమే స్పందించి యాకుబ్ మీమన్ కి ఉరిశిక్ష ఖరారు చేసిన త్రిసభ్య దర్మాసనాన్ని వారి విజ్ఞప్తిని పునః పరిశీలించమని ఆదేశించడంతో సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు ఆరోజు తెల్లవారుజామున 3-4.30 గంటల వరకు ఈ కేసును పునర్విచారించింది.

 

చట్టప్రకారం యాకుబ్ మీమన్ కి రెండు వారాల ముందుగా డెత్ వారెంట్ ఇవ్వలేదు కనుక అతని ఉరిశిక్షని నిలిపివేయాలని అతని తరపున న్యాయవాదులు వాదించారు. కానీ అతనికి టాడా కోర్టు మరణశిక్ష విధించినప్పుడే డెత్ వారెంట్ అందజేసిందని కనుక మళ్ళీ మరొకమారు డెత్ వారెంట్ ఇవ్వవలసిన అవసరం లేదని భారత అడ్వకేట్ జనరల్ ముకుల్ రొహత్గీ వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం న్యాయమూర్తి దీపక్ మిశ్ర వారి అభ్యర్ధను తిరస్కరించడంతో ఆరోజు ఉదయం యాకుబ్ మీమన్ ఉరితీయబడ్డాడు. అందుకే న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు ఎవరో గుర్తి తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ పంపారు.

 

దానిలో ఏమని ఉంది? ఎవరు పంపారు? ఎక్కడి నుండి ఆ లేఖ వచ్చింది? వంటి వివరాలన్నీ తెలియవలసి ఉంది. కానీ సుప్రీం న్యాయమూర్తినే ఈవిధంగా బెదిరించడం చూస్తే అది ఉగ్రవాదుల పనో లేక దేశంలో వారికి మద్దతు ఇస్తున్నవారి పనో అయ్యి ఉండవచ్చని అనుమానం కలుగుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu