పార్లమెంటులోనూ ఇద్దరు ఉగ్రవాదులున్నారుట!!!
posted on Aug 7, 2015 7:44AM
.jpg)
డిల్లీలోకి 9 మంది ఉగ్రవాదులు ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు చేసిన సంగతి తెలుసు. కానీ పార్లమెంటులో కూడా ఇద్దరు ఉగ్రవాదులు జొరబడిన సంగతి మన నిఘా వర్గాలు కూడా కనిపెట్టి చెప్పలేకపోయాయి. కానీ విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి ఆ విషయం కనిపెట్టి చెప్పారు. ఆమె తను ఒక సర్వసంగ పరిత్యాగి అయిన సాధువునని భావిస్తున్నప్పటికీ, రాజకీయాలపై ఆసక్తిని మాత్రం ఇంకా పరిత్యజించలేకపొతున్నారు. అందుకే నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ దుమారం లేపుతుంటారు.
పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ భద్రతా దళాలకు సజీవంగా పట్టుబడటంపై ఆమె స్పందిస్తూ, “అతనికి తగిన గుణపాఠం చెప్పాలంటే చట్టానికి కాదు హిందుసంస్థలకి అప్పగించాలి,” అని అన్నారు. ముంబై ప్రేలుళ్ళ పాత్రధారి యాకూబ్ మీమన్ కి ఉరి శిక్ష వేయడాన్ని కొందరు ఎంపీలు వ్యతిరేకించడంపై ఆమె చాలా తీవ్రంగా స్పందించారు. “ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేవారు కూడా ఉగ్రవాదులే! మన పార్లమెంటులో అటువంటి ఉగ్రవాదులు ఒకరిద్దరున్నారు. అటువంటివారు పార్లమెంటులో ఉండటం చాలా దురదృష్టకరం,” అని ఆమె అన్నారు.
ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ పట్టుబడినప్పుడు “తను హిందువులని చంపెందుకే పాకిస్తాన్ నుండి భారత్ కి వచ్చేనని, హిందువులని చంపడం తనకు చాలా వినోదం కలిగిస్తుందని” మీడియాతో చెప్పిన మాటలు ఆమెకు తీవ్ర ఆగ్రహం కలిగించి ఉండవచ్చును.అందుకే అతని విషయంలో ఆవిధంగా అని ఉండవచ్చును. ఉగ్రవాదులను సమర్ధించేవారి పట్ల కూడా ఆమె అసహనం వ్యక్తం చేయడం సహజమే. భారతదేశంలో చాలా బలమయిన చట్టాలు, రాజ్యాంగం, న్యాయవ్యవస్థలు ఉన్నాయి. అటువంటి ఉగ్రవాదులను ఏవిధంగా శిక్షించాలో అవి నిర్ణయిస్తాయి. కనుక ఆటవిక న్యాయం అమలు చేయమని సాధ్వి ప్రాచి వంటివారు కోరడం సమంజసం కాదు.
కొందరు రాజకీయ నేతలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే సుప్రీంకోర్టు దోషి అని తేల్చిన ఉగ్రవాదులకు సైతం మద్దతుగా మాట్లాడుతున్నారనే సంగతి అందరికీ తెలుసు. అటువంటి వారికి సమయం వచ్చినప్పుడు ప్రజలే తగినవిధంగా బుద్ది చెపుతారు.