జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

 

ఆగస్ట్ 15వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా సరిహద్దుల్లో ఉగ్రవాదుల హడావుడి కూడా నానాటికీ పెరిగిపోతోంది. మొదట పంజాబ్ లో గురుదాస్ పూర్ తరువాత జమ్మూలో ఉద్డంపూర్, మళ్ళీ ఈరోజు ఉదయం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే శ్రీనగర్ కి సుమారు 32 కిమీ. దూరంలో పుల్వామా జిల్లా కాకాపూరా గ్రామంలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ యుద్ధం జరిగింది. కాకాపూరా గ్రామంలో ఉగ్రవాదులు ఒక ఇంట్లో దాగిఉనట్లు తెలియగానే భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. వారిని చూడగానే లోపలి నుండి ఉగ్రవాదులు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. సుమారు గంటకుపైగా సాగిన వారి కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా మరొకడు తప్పించుకొని పారిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన ఇద్దరూ కూడా లష్కర్ ఏ తోయిబా గ్రూపుకి చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

మరోవైపు ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా డిల్లీలో ప్రేలుళ్ళకు పాల్పడేందుకు పాకిస్తాన్ కి చెందిన 9 మంది ఉగ్రవాదులు డిల్లీలో జొరబడ్డారని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో పట్టుకోవడానికి భద్రతాదళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఉగ్రవాదులు ఇంత తరచుగా భారత్ పై దాడులకు ప్రయత్నించలేదు. కానీ యాకుబ్ మీమన్ ని ఉరి తీసిన తరువాత నుండి తరచూ ఎక్కడో అక్కడ దాడులు చేస్తూనే ఉన్నారు. అతనిని ఉరి తీసినందుకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడుతున్నారా లేక తమ జోరు మరింత పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఉగ్రవాదులు ఈవిధంగా పేట్రేగిపోతున్నారా అనే విషయం తేలవలసి ఉంది. యాకుబ్ మీమన్ కి ఉరిశిక్షని ఖరారు చేసినందుకు సుప్రీంకోర్టు జస్టిస్ దీపక్ మిశ్రాను వదిలిపెట్టబోమని బెదిరిస్తూ ఒక బెదిరింపు లేఖ వచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu